- ఎమ్మెల్యే హరీశ్‌రావుపై ఎంపీ చామల ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలు.. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఆ పార్టీ మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీజేపీ కూడా 2014 నుంచి ఇప్పటివరకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూనే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విమర్శలు చేయగానే ఆ వెంటనే అవే విమర్శలను బీజేపీ చేస్తోందన్నారు. ఆ రెండు పార్టీల విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేండ్లలో తెలంగాణను రూ.లక్షల కోట్ల అప్పుల్లో ముంచడం తప్ప ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి.. తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
