శాలిగౌరారం( నకిరేకల్), వెలుగు: అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు చేరాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం భైరవుని బండ, పేర్క కొండారం గ్రామాల్లో ఎమ్మెల్యే మందుల సామేలు, కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సుమారు రూ.8 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు, గ్రామ సంఘ భవనం, సీసీ రోడ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌తో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆధునీకరించిన కంప్యూటర్ ల్యాబ్‌ను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమని, ప్రభుత్వంఅమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆరు గ్యారెంటీలు వంటి సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకూ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
