- డిఫెన్స్, ఏరోస్పేస్ పేరుతో షెల్ కంపెనీ నడుపుతున్నరు: ఎంపీ ధర్మపురి అర్వింద్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ కంపెనీకి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకే కట్టబెట్టారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
టీఎస్ఐఐసీ ద్వారా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో 5 ఎకరాల భూమిని సీఎం తమ్ముడి కంపెనీకి కేటాయించారని వెల్లడించారు. ఈ సంస్థకు డిఫెన్స్ లేదా ఏరోస్పేస్ తయారీ రంగానికి చెందిన అధికారిక గుర్తింపు లేదని, అది ఒక షెల్ కంపెనీ అని ఆరోపించారు. రూ.202 కోట్ల భూమిని రూ.7.5 కోట్లకే ఇచ్చారని మండిపడ్డారు. ఏరోస్పేస్ కంపెనీ అని ప్రచారం చేసుకుంటున్న టెస్సెరాక్ట్ సంస్థ.. తమ వెబ్సైట్లో గుజరాత్‌కు చెందిన టెక్స్టైల్ మిషన్లు, చైనా కంపెనీ ఫొటోలు, స్పేస్ఎక్స్ పరికరాల ఫొటోలను కాపీ చేసి పెట్టిందని ఆయన ఆరోపించారు.
