కేసీఆర్ శకం ముగిసింది..ఆయన దేశంలోనే అత్యంత అవినీతిపరుడు : ఎంపీ అర్వింద్

కేసీఆర్ శకం ముగిసింది..ఆయన దేశంలోనే అత్యంత అవినీతిపరుడు : ఎంపీ అర్వింద్

నిజామాబాద్  ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి కేసీఆర్ పై  నిప్పులు చెరిగారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.  కేసీఆర్‌కు మతిస్థిమితం తప్పింది.. ఆయన శకం ముగిసిందంటూ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే కేసీఆర్ అత్యంత అవినీతి పరుడని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఔటర్ రింగ్ రోడ్డులోనూ అవినీతికి పాల్పడ్డారని అన్నారు.  డ్రగ్స్ ను రాష్ట్రానికి పరిచయం చేసిందే కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.  జీవన్ రెడ్డిని పార్టీలో ఎందుకు చేర్చుకున్నారో కనీసం కేసీఆర్‌కే తెలియదని, దీనివల్ల జగిత్యాల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మత్తుకు బానిసలుగా మార్చిందని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై కనీస అవగాహన లేదని, పరిపాలనలో ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ గాలికొదిలేసిందని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు.

రాష్ట్రానికి ప్రధాని మోదీ రాకను స్వాగతిస్తూ.. సుమారు 7,800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టబోతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ ఇస్తున్నది కేంద్రమేనని, మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకుని మహిళా లోకాన్ని మోసం చేసిందని దుయ్యబట్టారు. పసుపు రైతులకు ఈరోజు వస్తున్న అధిక ధరలకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో అటు బిఅర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని.. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఎంపీ అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.