ఫొటోలతో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలి : పాలమూరు ఎంపీ డీకే అరుణ

ఫొటోలతో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలి : పాలమూరు ఎంపీ డీకే అరుణ

మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు: కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఫొటోలతో కూడిన డ్రాఫ్ట్​ ఓటర్​ లిస్ట్​ ప్రచురించాలని మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ డిమాండ్​ చేశారు. నగరంలోని బీజేపీ జిల్లా ఆఫీస్​లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. మహబూబ్​నగర్​ కార్పొరేషన్​లో ఓటరు జాబితాలో అనేక తప్పులు ఉన్నాయని, చాలా వార్డుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. 

తప్పులను సరి చేసి నోటిఫికేషన్​ ఇవ్వాలని, ఫొటోలు లేకపోవడం వల్ల ఓటర్లను గుర్తించడం కష్టమవుతుందని చెప్పారు. రాజకీయ అవసరాల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్  పాలమూరు ప్రాజెక్టులను వాడుకుంటున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్​ పదేండ్ల పాలనలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, ఆర్డీఎస్​ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టలేదన్నారు. 

జూరాల సోర్స్​ ఆధారంగా ఉన్న పాలమూరు లిఫ్ట్​ను డిజైన్​ను నార్లపూర్​ సోర్సు నుంచి నీటిని తీసుకునేలా మార్చారన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు నిర్లక్ష్యం చేసిన కేసీఆర్, ఇప్పుడు కేంద్రం డీపీఆర్​ను వెనక్కి పంపిందని బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఫైర్​ అయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పద్మజా రెడ్డి, పాండు రంగారెడ్డి, కొండా ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.