- లేదంటే అలంపూర్‌లో నిరాహార దీక్ష చేపడ్తానని హెచ్చరిక
న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై దాడి చేసినట్టు తప్పుడు ప్రచారం చేసి.. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. అలాగే, తనపై చర్యలు తీసుకోవాలంటూ తప్పుడు ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డిని ఇందులోకి లాగినందుకు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌కు సైతం క్షమాపణలు చెప్పాలన్నారు.
లేదంటే పార్టీ హైకమాండ్ పర్మిషన్ తీసుకొని కేటీఆర్, హరీశ్ రావు, ప్రవీణ్ కుమార్ క్షమాపణలు చెప్పేదాకా.. అలంపూర్‌లోనే గాంధేయ మార్గంలో నిరాహార దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. అలంపూర్ ఎమ్మెల్యేతో గొడవకి సంబంధించి బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. వేర్వేరు రాజకీయ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులుగా గెలిచినా.. ఎస్సీ వర్గానికి చెందిన తాను, విజయుడు అన్నదమ్ములుగా ఉంటామన్నారు.
