V6 News

డీలిమిటేషన్‌‌‌‌.. రాజకీయ నోట్ల రద్దు: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌‌‌‌‌‌‌‌

డీలిమిటేషన్‌‌‌‌.. రాజకీయ నోట్ల రద్దు: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌‌‌‌‌‌‌‌
  • ఈ నిర్ణయం దేశ సమాఖ్య వ్యవస్థకే ముప్పు.. దయచేసి దీన్ని చేయకండి
  • మహిళా రిజర్వేషన్లను పార్లమెంట్‌‌‌‌ స్థానాల విస్తరణతో ముడిపెడ్తరా?
  • ముళ్ల కంచెల మధ్య మహిళా న్యాయం అంటూ ఎద్దేవా 

న్యూఢిల్లీ: లోక్‌‌‌‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కేంద్ర ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేశారు. ఈ ప్రక్రియను 2016 నాటి ‘నోట్ల రద్దు’ (డిమానిటైజేషన్)తో పోల్చారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే దేశ సమాఖ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అనుబంధ సవరణలు, డీలిమిటేషన్‌‌‌‌ బిల్లులపై చర్చ సందర్భంగా శుక్రవారం లోక్‌‌‌‌సభలో శశిథరూర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. 

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును డీలిమిటేషన్, జనాభా గణనతో ముడిపెట్టడాన్ని  తీవ్రంగా తప్పుపట్టారు. ఇది భావ్యం కాదని పేర్కొన్నారు. ‘‘మహిళలకు న్యాయం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ బిల్లును డీలిమిటేషన్ అనే ముళ్ల కంచె మధ్య చుట్టి ఉంచింది”అని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్ అనేది ఇప్పుడే కోతకు సిద్ధంగా ఉన్న పంటలాంటిదని, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల ప్రకారమే దీన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయ నోట్ల రద్దులాంటిది.. 

నోట్ల రద్దు సమయంలో చూపించిన తొందరపాటే ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలోనూ కనిపిస్తోందని శశి థరూర్ విమర్శించారు. ‘‘అప్పుడు నోట్ల రద్దు వల్ల దేశానికి ఎంత నష్టం జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ‘రాజకీయ డిమానిటైజేషన్‌‌‌‌’ గా మారుతుంది. దయచేసి దీన్ని చేయకండి’’ అని ఆయన కోరారు. డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.  

తమిళనాడు, కేరళలాంటి రాష్ట్రాలు జాతీయ లక్ష్యాలను అనుసరించి జనాభాను నియంత్రించాయని, ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలు రాజకీయ బలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కేటాయించడం ద్వారా వారికి ‘రాజకీయ బహుమతి’ ఇచ్చినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేసిన థరూర్, కేవలం డీలిమిటేషన్ అంశాన్ని మాత్రం పక్కన పెట్టాలని కోరారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలంటే ఈ విషయంపై లోతైన చర్చ జరగాలని ఆయన సూచించారు.