హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ సమ్మెలో భాగంగా ఈ రోజు బస్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దాంతో పోలీసులు జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి నుంచి ఆయన ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. అది తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు రాజిరెడ్డి ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. తన ఇంటి ముందు మహారాష్ట్రకు చెందిన పోలీస్ వాహనాల్లో పోలీసులు మఫ్టీలో వచ్చి ఉన్నట్లు ఆయన తెలిపారు. పోలీసులు ఎంత నిర్భందించినా తాము దీక్షలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ రోజు జేఏసీ నేతలు నలుగురం కలిసి నిరాహార దీక్షకు కూర్చోవాలని అనుకున్నామని.. దాని కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరగా నిరహార దీక్షకు అనుమతి తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. రాజిరెడ్డిని అరెస్ట్ చేయాలని రాత్రి నుంచి పోలీసులు ప్రయత్నిస్తూ.. ఎట్టకేలకు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు.
