ములుగు, వెలుగు : ములుగులోని సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సహకారంతో సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆఫీసర్లు ప్రతిపాదనలను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ముందు ఉంచారు. బుధవారం ములుగు కలెక్టరేట్లో హైదరాబాద్ లోని బీబీనగర్ ఎయిమ్స్ డీన్ రిసెర్చ్ డా.రాహుల్ నరాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలెక్టర్ ను కలిశారు.
ఈ సందర్భంగా బృందం సభ్యులు ప్రతిపాదిత కేంద్రం లక్ష్యాలు, గిరిజన ఆరోగ్య సేవల బలోపేతం, వైద్య పరిశోధనలు, అకడమిక్ సహకారం, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యరంగ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సెంట్రల్ యూనివర్సిటీ వీసీ వైఎల్.శ్రీనివాస్, డీఎంహెచ్‌వో డాక్టర్ గోపాల్రావు, ములుగు, ఏటూరునాగారం ఆసుపత్రుల సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సురేష్, ఎయిమ్స్ వైద్య బృందం సభ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
