మేడారం జాతరపై  తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు.. సేఫ్టీ, సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా పని చేశాం: ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

మేడారం జాతరపై  తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు.. సేఫ్టీ, సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా పని చేశాం: ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

ములుగు, వెలుగు: మేడారం మహాజాతరలో సజావుగా జరిగినప్పటికీ కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్పీ సుధీర్​రాంనాథ్​కేకన్  తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ములుగు జిల్లా పోలీస్​ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్​ఫ్లో కు సరిపడా ఔట్ ఫ్లో లేకపోవడంతో పాటు వైల్డ్​ లైఫ్ పరిధిలోని మేడారం, తాడ్వాయి రూట్ లో ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ వాహనాలతో ట్రాఫిక్​ జాం అయినట్లు తెలిపారు. 

కిలో మీటరుకో పోలీసు ఔట్​ పోస్ట్​ ఏర్పాటు చేశామని, వచ్చే జాతర వరకు ప్రత్యేక రోడ్డు ఏర్పాటు చేయాలని సూచించామని చెప్పారు. మేడారంలో బాలికపై రేప్​ జరిగిందని సోషల్  మీడియాలో ప్రచారం చేస్తున్నారని, పోలీసుల విచారణలో అలాంటిదేమీ లేదని తేలిందన్నారు. ఎవరైనా వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తుల భద్రత, దర్శనం చేయించడంపైనే పోలీసు శాఖ దృష్టి సారించిందని, జాతరలో లోపాలను సరిదిద్దుకొని వచ్చే జాతర వరకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని తెలిపారు. సమ్మక్క, సారలమ్మ జాతర సక్సెస్​ కోసం కృషి చేసిన వారికి కృతజ్క్షతలు తెలిపారు. 

ముందస్తుగానే 80 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, జాతర సందర్భంగా కోటిన్నర మంది భక్తులు రాగా సజావుగా దర్శనం చేయించడంలో సక్సెస్​ అయ్యామని తెలిపారు. మాస్టర్​ ప్లాన్​లో భాగంగా జిల్లా పోలీసు అధికారులు 40 రోజులు ఇక్కడే ఉండి పని చేశారని చెప్పారు. ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్​ భట్, డీఎస్పీ ఎన్.రవీందర్, ఆర్టీసీ ఆర్ఎం భాను ప్రసాద్ పాల్గొన్నారు.

నేడు తిరుగువారం పండుగ  

తాడ్వాయి: మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో బుధవారం తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన వారం రోజుల తర్వాత తిరుగువారం జరపడం ఆనవాయితీ. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి, దీపాలు వెలిగించి, యాటను నైవేద్యంగా సమర్పించనున్నారు. పూజారుల కుటుంబసభ్యులు, ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం పూజా సామగ్రి, వస్త్రాలను ఆలయాల్లో భద్రపరుస్తారు. తిరుగువారంతో మహాజాతర కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. 

బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేకపోతున్నయ్..​

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, అధికారుల చొరవతో మేడారం సమ్మక్క జాతర సక్సెస్  అవడాన్ని బీఆర్ఎస్, బీజేపీలు ఓర్వలేకపోతున్నాయని మహా జాతర ఉత్సవ కమిటీ చైర్మన్  ఇర్ఫ సుకన్య సునీల్  విమర్శించారు. మంగళవారం అమ్మవార్ల సన్నిధిలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్​ హయాంలో ఒక్క మంత్రి కూడా మేడారం జాతరను పట్టించుకోలేదన్నారు. రూ.250 కోట్లతో రోడ్లు, సెంట్రల్​ లైటింగ్, నీటి సదుపాయం, గుడి పునర్నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్  సమావేశం జరిగిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని, మంత్రి సీతక్కను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. జాతరపై విషం చిమ్మితే సహించేది లేదన్నారు. జాతర సదుపాయాల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్, బీజేపీకి లేదన్నారు.

ఒకరు సస్పెన్షన్, ఇద్దరికి మెమోలు

మేడారం జాతర విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎండోమెంట్​ఎలక్ట్రీషియన్  వీరన్నను సస్పెండ్  చేశామని, నక్క శ్రీనివాస్, నారాయణకు మెమో జారీ చేశామని ఈవో వీరాస్వామి తెలిపారు.

మేడారం జాతరలో రూ.4.41 కోట్ల మద్యం తాగిన్రు

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: మేడారం మహాజాతర నేపథ్యంలో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 రోజుల్లో జాతరకు వచ్చిన భక్తులు రూ. 4.41కోట్ల మద్యాన్ని తాగేశారు. మేడారంలో ప్రభుత్వ వైన్​ షాపులతో పాటు ఈవెంట్ పర్మిషన్ తో 9 రోజుల పాటు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్​ శాఖ అనుమతులు ఇచ్చింది. 

ఈ షాపుల ద్వారా ప్రభుత్వానికి రూ. 4.41 కోట్ల ఆదాయం వచ్చింది. జనవరి నెలలో భూపాలపల్లి, ములుగు జిల్లాలు కలిపి రూ. 69.63 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 48 శాతం మద్యం సేల్స్ తో రెండు జిల్లాలు తెలంగాణలోనే టాప్​లో నిలిచినట్లు ఎక్సైజ్  సూపరింటెండెంట్  వేముల శ్రీనివాస్ తెలిపారు. గత ఏడాది జనవరిలో 44 కోట్ల మద్యం సేల్స్  జరిగాయని. సంక్రాంతి పండగకు తోడు మేడారం జాతర కలిసి రావడంతో అమ్మకాలు పెరిగినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.