- చెలరేగిన క్రునాల్, భువనేశ్వర్
- తిలక్ వర్మ, నమన్ ధీర్, కార్బిన్ పోరాటం వృథా
రాయ్‌పూర్: ఐపీఎల్–19లో ముంబై ఇండియన్స్‌కు షాక్. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఘోరంగా ఫెయిలైంది. దాంతో ఆదివారం లాస్ట్ బాల్ వరకు థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో బెంగళూరు చేతిలో ఓడి నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 166/7 స్కోరు చేసింది. తిలక్ వర్మ (42 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) టాప్ స్కోరర్.
నమన్ ధీర్ (32 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) ఫర్వాలేదనిపించాడు. పిచ్‌పై ఉన్న పగుళ్లను, అసమాన బౌన్స్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్న భువనేశ్వర్ (4/23) ముంబై టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. తొలి ఓవర్‌లోనే రికెల్టన్ (2)ను ఔట్ చేసిన భువీ మూడో ఓవర్‌లో డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బాల్స్‌లో రోహిత్ (22), సూర్యకుమార్ (0)ను దెబ్బకొట్టాడు. దీంతో ముంబై 28/3తో కష్టాల్లో పడింది.
ఈ దశలో తిలక్, నమన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. పవర్‌ప్లేలో 53/3 స్కోరు చేసి క్రమంగా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. 9 రన్స్ వద్ద తిలక్ ఇచ్చిన క్యాచ్‌ను సుయాష్ శర్మ వదిలేశాడు.
ఈ ఇద్దరు స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టారు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 82 రన్స్ జోడించారు. కానీ 13వ ఓవర్‌లో రాసిక్ సలామ్ (1/42) దెబ్బకు నమన్ వెనుదిరగడంతో స్కోరు 110/4గా మారింది. 37 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన తిలక్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో విల్ జాక్స్ (10), రాజ్ భజ్వా (16) కాసేపు పోరాడి విఫలమయ్యారు. కార్బిన్ బోష్ (5 నాటౌట్), దీపక్ చహర్ (1 నాటౌట్)తో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేసింది.
ఆఖరి బాల్ వరకు ఉత్కంఠ
ఛేజింగ్‌లో బెంగళూరు 20 ఓవర్లలో 167/8 స్కోరు చేసి నెగ్గింది. క్రునాల్ పాండ్యా (46 బాల్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 73) ఒంటరి పోరాటంతో టీమ్‌ను గట్టెక్కించాడు. జాకబ్ బెథెల్ (26) ఫర్వాలేదనిపించినా.. విరాట్ కోహ్లీ (0), దేవదత్ పడిక్కల్ (12), రజత్ పటీదార్ (8) విఫలమయ్యారు.
దాంతో 39/3తో కష్టాల్లో పడిన ఆర్సీబీని క్రునాల్ ఆదుకున్నాడు. బెథెల్‌తో నాలుగో వికెట్‌కు 55, జితేష్ శర్మ (18)తో ఐదో వికెట్‌కు 37 రన్స్ జోడించాడు. అయితే 16వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో జితేష్, టిమ్ డేవిడ్ (0) ఔట్ కావడంతో ఉత్కంఠ మొదలైంది.
రొమారియో షెఫర్డ్ (4)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో క్రునాల్.. తిలక్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఫలితంగా చివరి 12 బాల్స్‌లో 18 రన్స్ అవసరమైన దశలో షెఫర్డ్, రసిక్ సలామ్ (3 నాటౌట్) పోరాటం మొదలుపెట్టారు.
కానీ 19వ ఓవర్‌లో బుమ్రా 3 రన్స్‌తోనే సరిపెట్టడంతో టార్గెట్ 6 బాల్స్‌లో 15 రన్స్‌గా మారింది. చివరి ఓవర్‌లో రాజ్ బవా వైడ్, నో బాల్ వేయడంతో ఆర్సీబీ కాస్త తేరుకుంది. కానీ మూడో బాల్‌కు షెఫర్డ్ ఔట్ కావడంతో ఉత్కంఠ మళ్లీ మొదలైంది. చివర్లో భువనేశ్వర్ (7 నాటౌట్) సిక్స్‌తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. భువనేశ్వర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 166/7 (తిలక్ 57, నమన్ 47, భువనేశ్వర్ 4/23).
బెంగళూరు: 20 ఓవర్లలో 167/8 (క్రునాల్ 73, కార్బిన్ బోష్ 4/26).
