తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో సీటుకు నలుగురు పోటీ!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో  ఒక్కో సీటుకు నలుగురు పోటీ!
  •     మున్సిపల్ ఎన్నికల బరిలో 12,993 వేల మంది 
  •     వార్డుల వారీగా లిస్టులు ప్రకటించిన ఎన్నికల సంఘం 
  •     ఇయ్యాల్టి నుంచి ఆరు రోజుల పాటు ప్రచారం

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో సీటుకు నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు కార్పొరేషన్లలోని 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీలలోని 2,582 వార్డులకు కలిపి 12,993 మంది బరిలో నిలిచారు. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం మేరకు 6,701నామినేషన్లను అభ్యర్థులు విత్​ డ్రా చేసుకున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. 

పోటీలో ఉన్న అభ్యర్థులకు రిటర్నింగ్ ఆఫీసర్లు గుర్తులను కేటాయించారు. అయితే నాలుగు వార్డులను కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

6,701 నామినేషన్ల విత్​డ్రా

రాష్ట్రంలో వార్డుల, డివిజన్లు కలిపి మొత్తంగా 2,996  స్థానాలకు 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 10,046, నామినేషన్లు. బీఆర్ఎస్ నుంచి 7,564, బీజేపీ నుంచి 5,462 నామినేషన్స్ దాఖలయ్యాయి. స్క్రూటినీ తర్వాత సోమవారం నాటికి 19,608 వ్యాలిడ్ నామినేషన్లు ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. అలాగే మంగళవారం రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం మేరకు  6,701 మంది నామినేషన్ల ఉపసంహరించుకున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.  

దీంతో మిగిలిన 12,993 మంది జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులు, ఇండింపెండెంట్లకు వరస క్రమంలో గుర్తులు కేటాయించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నేటి(బుధవారం) నుంచి ఆరు రోజుల పాటు అంటే ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చు. ఈ నెల 11న ఉదయం 8 గంటలకు పోలింగ్​ స్టార్ట్ అవుతుంది.

నాలుగు వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ?

విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్రంలో నాలుగు వార్డులను కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకున్నది. రామగుండం కార్పొరేషన్ లోని ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్య కాలనీ, మేడిపల్లి ప్రాంతంతో కూడిన 1వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మడిపెల్లి విజయ మల్లేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ డివిజన్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తమ నామినేషన్లను విత్​ డ్రా చేసుకున్నారు. 

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలోని 11 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవరం మల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా సమాచారం. అలాగే యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 10వ వార్డు, చౌటుప్పల్ మున్సిపాలిటీ​లో 17వ వార్డులను కాంగ్రెస్​పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నట్టు తెలిసింది.