ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు

ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపించారని ముగ్గురు పోలీసు అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, ఏసీపీ యాదగిరి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లపై హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య సస్పెన్షన్ వేటు వేశారు. మంగళవారం (నవంబర్ 28న) రాత్రి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో ఓటర్లకు డబ్బులు పంచుతూ ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ కుమారుడు ముఠా జయ సింహా పట్టుబడ్డాడు.

ఈ కేసులో ముఠా జయ సింహాను తప్పించి.. మరో ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించి, ఎమ్మెల్యే కుమారుడికి సహకరించారని వచ్చిన ఆరోపణలతో ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, ఏసీపీ యాదగిరి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లపై హైదరాబాద్ సీపీ  సందీప్ శాండిల్య సస్పెన్షన్ వేటు వేశారు.

డబ్బులు లభ్యమైన కారు AP28CH6759 కారును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు ముఠా జై సింహా పరారీలో ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.

ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన తర్వాత వారి స్థానాల్లో సెంట్రల్ డీసీపీగా ఏ. శ్రీనివాస్, చిక్కడపల్లి ఏసీపీగా మదన్ మోహన్, ఇన్ చార్జ్ సీఐగా వెంకట్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆదేశాల మేరకు తాను సెంట్రల్ జోన్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించానని ఏ. శ్రీనివాస్ చెప్పారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పని చేస్తామని చెప్పారు. ప్రజలెవరూ ప్రలోభాలకు లోనవ్వకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.