ముస్లింలకు మహారాష్ట్ర సర్కారు షాక్ ఇచ్చింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 2014లో జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం అధికారికంగా క్యాన్సిల్ చేసింది.
ముంబై: ముస్లింలకు మహారాష్ట్ర సర్కారు షాక్ ఇచ్చింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 2014లో జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం అధికారికంగా క్యాన్సిల్ చేసింది. 2014 నాటి విధానంపై కోర్టు ఇచ్చిన తీర్పులు, ప్రస్తుతం ఉన్న చట్టపరమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
మరోవైపు రిజర్వేషన్లను రద్దు చేయడంతో మహారాష్ట్రలో రాజకీయ దూమారం రేగింది. రాష్ట్ర జనాభాలో ముస్లింల వాటా 11.5 శాతంగా ఉంది. వీరి ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పలు కమిటీలు గతంలోనే వెల్లడించాయి. జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్ (2006), జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ (2004) గణాంకాలతో సహా ముస్లింల దుస్థితిని వివరించాయి. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన డాక్టర్ మెహమూదుర్ రెహ్మాన్ కమిటీ ముస్లింలకు 8 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది.
వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు
2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్–-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సుమారు 50 ముస్లిం ఉపకులాలను ‘స్పెషల్ బ్యాక్‌వర్డ్ కేటగిరీ -ఏ’ (ఎస్‌బీసీ ఏ) కింద చేర్చి ఈ ప్రయోజనాలను అందించాలని నిర్ణయించారు. అయితే, కోర్టు తీర్పుల కారణంగా ఆ రిజర్వేషన్ చట్టపరంగా అమలులో లేకుండా పోయింది.
కానీ ఈ ఆర్డినెన్స్ను ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా రద్దు చేయలేదు. దాదాపు పదేండ్ల తర్వాత ఇప్పుడు మహాయుతి సర్కారు కొత్త ఉత్తర్వుతో రిజర్వేషన్లను ఎత్తేసింది. దీని ప్రకారం, 5శాతం ముస్లిం రిజర్వేషన్ కింద ఇకపై ఎలాంటి అడ్మిషన్లు ఉండవు. ఆ కేటగిరీలో కొత్త కుల లేదా చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్లు జారీ చేయరు.
