ఇవాళే బక్రీద్.. మసీదుల్లో నమాజ్

ఇవాళే బక్రీద్.. మసీదుల్లో నమాజ్

నేడే ఈద్ ఉల్ అద్హా

హైదరబాద్, వెలుగు :  సోమవారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించకుని పాతనగరం ముస్తాబైంది. ఆయా బస్తీల్లో ఉన్న ప్రార్థన స్థలాలు, ఈద్గాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాతబస్తీలో ఈద్ ఉల్​ అద్హా ప్రత్యేక ప్రార్థనల కోసం మీరాలం ఈద్గాలో భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం అన్నారు. జూపార్కు సమీపంలోని  మీరాలం ఈద్గాను వివిధ ప్రభుత్వ విభాగాల అధికారుల బృందంతో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు. ఈద్ ఉల్​అజ్హా ప్రార్థనల కోసం ఏర్పాటుచేసిన  టెంట్లు,షామీయానా, జానీమాస్​తదితర  వసతులను సలీం పరిశీలించారు. సోమవారం సామూహిక ప్రార్థనలు  చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామన్నారు. శనివారం మధ్యాహ్నమే బల్దియా కమిషనర్ దానకిశోర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంజినీరింగ్ విభాగం అధికారి జియావుద్దీన్ తో కలిసి మీరాలం ఈద్గా వద్ద పనులను పరిశీలించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి గ్రేటర్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ సైతం మీరాలం ఈద్గాను సందర్శించి..అధికారులకు పలు సూచనలు చేశారు. మరోవైపు చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులోనూ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మసీదు ఆవరణలో ప్రార్థనకు వచ్చే భక్తులకు  ఇబ్బంది లేకుండా కమిటీ నిర్వాహకులు షామీయానా,టెంట్ లను పెట్టించారు. మీరాలం ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనల వద్ద విద్యుత్తు అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు సౌత్ జోన్ విద్యుత్తు అధికారులు తెలిపారు. ప్రార్థనకు వచ్చే భక్తుల కోసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని వాటర్ బోర్డు అధికారులు కల్పిస్తున్నారు. బహుదూర్ పురాలో ప్రార్థనా మందిరాల వద్ద పారిశుద్ధ్య విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జీఎహెచ్ఎంసీ ఫలక్ నుమా సర్కిల్  డీఎంసీ సుమన్ రావు అన్నారు. మీరాలం ఈద్గా వద్ద భద్రతా ఏర్పాట్లను సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ సయ్యద్ రఫీక్, చార్మినార్ ఏసీపీ అంజయ్యతో కలిసి పరిశీలించారు.

ఈ మార్గాల్లో వెహికల్స్ దారి మళ్లింపు

సోమవారం బక్రీద్  సందర్భంగా ఉదయం  బహుదూర్ పుర నుంచి ఆరాంఘర్ వరకు రహదారిని మూసివేస్తున్నట్టు సౌత్ జోన్ ట్రాఫిక్ డీసీపీ కె.బాబురావు అన్నారు. ఈ మార్గాల్లో వచ్చే వెహికల్స్ ను దారిమళ్లిస్తున్నామన్నారు. పురానాపూల్ నుంచి వచ్చే వెహికల్స్ ను బహుదూర్ పురా చౌరస్తా నుంచి కిషన్ బాగ్ వెళ్లేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. ఆరాంఘర్​నుంచి వచ్చే వెహికల్స్ ను దానమ్మ జోపిడి నుంచి ఎన్.ఎస్​కుంటాకు దారి మళ్లిస్తున్నట్టు ఆయన చెప్పారు. షంషీర్​గంజ్​నుంచి వచ్చే వెహికల్స్ కి తాడ్ బన్ చౌరస్తా వరకు మాత్రమే పర్మిషన్ ఉందన్నారు. మీరాలం ఈద్గాకు వచ్చే వెహికల్స్ పార్కింగ్​కు జూపార్కులో స్థలం కేటాయించామన్నారు. ఆరాంఘర్​నుంచి వచ్చే వారి కోసం దానమ్మ జోపుడి వద్ద పార్కింగ్​సెంటర్ ఏర్పాటుచేశామన్నారు. ఉదయం 7 నుంచి11 గంటల వరకు బహదూర్ పుర మెయిన్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తామని ప్రార్థనలు అనంతరం ట్రాఫిక్ యథావిధిగా ఉంటుందనిసౌత్ జోన్ ట్రాఫిక్ డీసీపీ బాబురావు తెలిపారు. 100 మంది పోలీస్​కానిస్టేబుళ్లు, ఆరుగురు ఇన్స్​స్పెక్టర్లు, ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఓ డీసీపీ స్థాయి అధికారులు ట్రాఫిక్ నియంత్రణలో పాల్గొంటారన్నారు. మాదన్నపేట ఈద్గా వద్ద సైతం ఇద్దరు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లతో పాటు 30 మంది పోలీస్ కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తారని ఆయన చెప్పారు.

జోరుగా పొట్టేళ్ల అమ్మకాలు

బక్రీద్ సందర్భంగా ట్విన్ సిటీస్ లో ని పలు ప్రాంతాల్లో ఆదివారం పొట్టేళ్ల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. పాతబస్తీతో పాటు సిటీ శివార్లలో ఇతర జిల్లాల నుంచి యజమానులు గొర్రెలను వాహనాల్లో తీసుకొచ్చి అమ్మారు.   చంచల్‌‌గూడ, టోలీచౌకీ, మెహిదీపట్నం, గొల్కోండ, నయాపూల్‌‌, సెవెన్‌‌ టూంబ్స్‌‌ లాంటి ప్రాంతాల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద జనాల సందడి కనిపించింది. వ్యాపారులు తీసుకొచ్చిన వివిధ  బ్రీడ్ లను కొనేందుకు సిటిజన్లు ఆసక్తి చూపారు.