- అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్సే : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
- రిజర్వేషన్లు వద్దంటూ నెహ్రూ రాసిన లేఖలు మర్చిపోయారా?
- మహిళా బిల్లుపై రేవంత్, రాహుల్ వి విరుద్ధ వ్యాఖ్యలని కామెంట్
హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారని, కానీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటే సరిపోదని దానిని మనసులో పెట్టుకొని ఆచరించాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్.రాంచందర్ రావు అన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదని, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడని రాంచందర్ రావు కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను అడుగడుగునా అడ్డుకున్నదని ఆరోపించారు. బాంబే ప్రెసిడెన్సీలో ఆయనను పోటీ చేయకుండా అడ్డుకోవడం, రాజ్యాంగ సభలో అవకాశం ఇవ్వకపోవడం వంటి చర్యలు కాంగ్రెస్ చేసినవేనని చెప్పారు. చివరికి ముస్లిం లీగ్ మద్దతుతోనే ఆయన అసెంబ్లీలోకి వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు. నెహ్రూ హయాంలో అంబేద్కర్ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారని, 1953, 1961లో నెహ్రూ రాసిన లేఖల్లో రిజర్వేషన్లు ప్రమాదకరమని చెప్పినట్టు పేర్కొన్నారు. అంబేద్కర్ మరణం తర్వాత కూడా ఆయనకు భారత రత్న ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానించిందని వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాతే అంబేద్కర్ కు సరైన గౌరవం దక్కిందని రాంచందర్ రావు పేర్కొన్నారు.
మహిళా బిల్లుపై కాంగ్రెస్ గందరగోళం
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని రాంచందర్ రావు విమర్శించారు. ‘మహిళా రిజర్వేషన్లకు, డీలిమిటేషన్, సెన్సస్‌కు సంబంధం లేదని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో చెప్పారు. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ మూడింటిని కలిపి మాట్లాడుతున్నారు. ఇది వారి పార్టీలోని అస్పష్టతను తెలియజేస్తున్నది’ అని అన్నారు. డీలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, 2026 తర్వాత చేపట్టనున్న సెన్సస్ ఆధారంగా జరుగుతుందని స్పష్టం చేశారు. సీట్లు తగ్గవు.. ప్రపోర్షనేట్‌గా పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది తప్పుడు ప్రచారమన్నారు. ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, మాజీ ఎంపీ సీతారాంనాయక్ , కొప్పు భాషా, మనోహర్ రెడ్డి, శాంతికుమార్, వేముల అశోక్ పాల్గొన్నారు.

