మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరంలో 48 వేల కోట్లు తిన్నడు : నాగం జనార్దన్ రెడ్డి

మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరంలో 48 వేల కోట్లు తిన్నడు : నాగం జనార్దన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: చిన్న సబ్ కాంట్రాక్టర్‌‌‌‌గా ఉన్న మేఘా కృష్ణారెడ్డి తక్కువ కాలంలోనే దేశంలోనే అతిపెద్ద కాంట్రాక్టర్‌‌‌‌గా ఎలా ఎదిగారని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన రూ.48 వేల కోట్లు తిన్నారని ఆరోపించారు. ఇటలీలో వేల కోట్ల రూపాయలతో దందా నడుపుతున్నారని మండిపడ్డారు. ఇన్ని వేల కోట్లను ఎవరబ్బ సొత్తని లూటీ చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు మేఘా కృష్ణారెడ్డి క్యాన్సర్‌‌‌‌, గ్యాంగ్‌‌స్టర్ కన్నా ప్రమాదకరంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌లో మీడియాతో మాట్లాడారు. 

రూ.7,200 కోట్లను ఎలక్ట్రో మెకానిక్ పరికరాల కోసం చెల్లింపులు చేసినట్టు చూపించారని, కానీ, వాటిని సప్లయ్‌‌ చేసిన బీహెచ్‌‌ఈఎల్‌‌కు ముట్టింది కేవలం రూ.1,600 కోట్లేనన్నారు. ఈ లెక్కలన్నీ కాగ్ రిపోర్ట్‌‌లోనే ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతితో వేల కోట్ల మనీ లాండరింగ్‌‌కు కృష్ణా రెడ్డి పాల్పడ్డారని నాగం ఆరోపించారు. ఆయన దగ్గర్నుంచి ఆ పైసలను వసూలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 

అన్ని రాజకీయ పార్టీలకు మేఘా కృష్ణా రెడ్డి ఫైనాన్స్ చేస్తూ.. వాళ్లకు మాట్లాడే స్వేచ్ఛనివ్వడం లేదని మండిపడ్డారు. దీనికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావే బాధ్యులన్నారు. కాగా, కర్నాటకలో 40 శాతం కమీషన్‌‌పై పోరాడిన సంగతి పక్కనపెట్టాలని, తెలంగాణలో 70 శాతం కమీషన్ సర్కారుపై ఎలా పోరాడబోతున్నారని కాంగ్రెస్ నేతలను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ చీడ పురుగులా తయారయ్యారని మండిపడ్డారు. తనకు, గాంధీ భవన్‌‌కు దూరం ఏమీ పెరగలేదన్నారు.