- రెండు మూడు రోజుల్లో భగత్ పేరును ప్రకటించనున్న టీఆర్ఎస్
- సెంటిమెంట్ కలిసి వస్తుందని భావిస్తున్న పార్టీ
- ఇన్చార్జిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బాధ్యతలు?
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 23న సాగర్ బైపోల్ షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో నోముల నర్సింహయ్య కొడుకు భగత్‌ను అక్కడి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. భగత్‌కు టికెట్ ఇచ్చే విషయంపై ఇప్పటికే నల్గొండ జిల్లా లీడర్లకు టీఆర్ఎస్ పెద్దలు సమాచారం అందించారు. నోముల నర్సింహయ్య చనిపోయిన తర్వాత సాగర్ స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఉప ఎన్నిక తప్పలేదు. యాదవుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని టీఆర్ఎస్ భావించింది. భగత్‌కు టికెట్ ఇచ్చే విషయంపై చర్చలు జరిపింది. భగత్‌తో పాటు యాదవ కులానికి చెందిన ఇతర నేతల పేర్లనూ పరిశీలించింది. నోముల కుటుంబానికి టికెట్‌ఇవ్వకపోతే దుబ్బాకలో ఓ న్యాయం, సాగర్‌లో మరో న్యాయమా అన్న విమర్శలు వస్తాయన్న చర్చ జరిగింది. ఆ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందో సర్వేలు కూడా చేయించింది. సాగర్‌లో పార్టీపై పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయని, అభ్యర్థి ఎవరైనా గెలిచే చాన్సుందని సర్వేల్లో తేలింది. దీంతో భగత్‌ను బరిలోకి దింపితే సెంటిమెంట్ కలిసి వస్తుందని భావించింది. ఈ నేపథ్యంలోనే భగత్ అభ్యర్థిత్వంపై నల్గొండ జిల్లా నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల బాధ్యతలను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
