తిమ్మాజీపేట ఎస్సైని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు... మైనింగ్ రవాణాలో పట్టుకున్న వాహనాల విషయంలో అవినీతి

తిమ్మాజీపేట ఎస్సైని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు... మైనింగ్ రవాణాలో పట్టుకున్న వాహనాల విషయంలో అవినీతి

కందనూలు, వెలుగు: మైనింగ్  అక్రమ రవాణాలో పట్టుబడిన వాహనాలను వదిలిపెట్టేందుకు డబ్బులు డిమాండ్  చేసిన నాగర్​కర్నూల్​ జిల్లా తిమ్మాజీపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డిని సోమవారం ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్  బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5న మరికల్  ప్రాంతంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ, రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు.

 మైనింగ్  ఆఫీసర్లు రూ.60 వేలు జరిమానా విధించగా, ఓనర్​ ఆ మొత్తాన్ని చెల్లించాడు. జరిమానా చెల్లించిన తర్వాత వాహనాలను రిలీజ్​ చేసేందుకు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.30 వేలు డిమాండ్  చేశాడు. ఓనర్​ రూ.20 వేలు ఇవ్వగా, మిగిలిన రూ.10 వేల కోసం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

సోమవారం తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టి, గతంలో ఇచ్చిన డబ్బులకు సంబంధించిన ఆధారాలతో ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఏసీబీకి పట్టుబడడంతో తిమ్మాజిపేట మండల కేంద్రంలో స్థానికులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.