V6 News

తెలుగు భాషకు ప్రాచీన హోదా ఘనత మలయశ్రీదే

తెలుగు భాషకు ప్రాచీన హోదా ఘనత మలయశ్రీదే
  •   మనం గర్వించదగిన సాహిత్య, చరిత్ర పరిశోధకుడు
  •     కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్‌‌

కరీంనగర్, వెలుగు : ‘కరీంనగర్‌‌ కురిక్యాల శాసనంలోని కంద పద్యాలు క్రీ.శ. 946 నాటివని నిర్ధారణ చేసి చెప్పింది మలయశ్రీయే, ఆయన అందించిన ఆధారాలతోనే తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కింది’ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్‌‌ చెప్పారు. తెలుగు రాష్ట్రాలు గర్వించదగిన గొప్ప సాహిత్య, చరిత్ర పరిశోధకుడు మలయశ్రీ అని కొనియాడారు. పరిశోధకుడు, సాహితీవేత్త, హేతువాది మలయశ్రీ సంస్మరణ సభను కరీంనగర్‌‌లోని ఐఎంఏ హాల్‌‌లో వివిధ సాహితీ సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా నలిమెల భాస్కర్‌‌ మాట్లాడుతూ.. సాహిత్య సృజన అంటే అప్పటికప్పుడు భావావేశానికిలోనై, స్పందించి రాస్తారని, కానీ పరిశోధన అలా కూర్చుని చేసే పని కాదని, నడుం వంచి చేయాల్సిన కష్టమైన పని అన్నారు. మలయశ్రీ తన పరిశోధన ద్వారా ఏది చెప్పినా ఉదాహరణలు, నిరూపణలతో రాసేవారన్నారు. 

బుద్ధుడి సమకాలీకుడైన బావరిముని గోదావరి తీరంలోని బాదనకుర్తిలో నివాసం ఉన్నట్లు నిరూపించారని గుర్తు చేశారు. శాతావాహన, కాకతీయ, రాచకొండ రాజులపై లోతైన పరిశోధనలు చేశారన్నారు. సాహితీవేత్త దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ మలయశ్రీ పురస్కారాల కోసం వెంపర్లాడిన మనిషి కాదని, నమ్మిన సిద్ధాంతాన్ని జీవితాంతం ఆచరిస్తూ తానే స్వయంగా పురస్కారం అందజేశారని తెలిపారు. మలయశ్రీ ముక్కుసూటి మనిషని, మాట కటువుగా ఉన్నా... ఆయన ఉద్దేశాన్ని పరిశీలిస్తే అందులో వాస్తవం అర్థం అవుతుందన్నారు. భౌతికవాదిగా పేరున్న ఆయన రామాయణ, మహాభారతాలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారన్నారు. మలయశ్రీలాంటి పరిశోధకులు అరుదుగా ఉంటారని ప్రశంసించారు. సభలో సాహితీవేత్తలు గండ్ర లక్ష్మణరావు, గాజోజు నాగభూషణం, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ బీఎన్‌‌.రావు, దళిత లిబరేషన్‌‌ ఫ్రంట్‌‌ నాయకుడు మార్వాడి సుదర్శన్ పాల్గొన్నారు.