మీనాక్షి నటరాజన్ కేసులో నేడు (జూన్ 12) విచారణ

మీనాక్షి నటరాజన్ కేసులో నేడు (జూన్ 12) విచారణ
  • బీఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ 223 కింద ప్రైవేట్ కంప్లైంట్‌‌‌‌
  • నాంపల్లి కోర్టులో నేడు కౌంటర్‌‌‌‌ నోటీసులపై‌‌‌‌ విచారణ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌‌‌  ప్రతివాదిగా ఉన్న కేసులో శుక్రవారం నాంపల్లి కోర్టు విచారణ  చేపట్టనుంది. మీనాక్షితోపాటు మిగిలిన  ప్రతివాదుల నుంచి వివరణ తీసుకున్న అనంతరం పిటిషన్‌‌‌‌ ను విచారణకు స్వీకరించాలా? వద్దా? అనే అంశంపై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో ఈ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. తార్నాకకు చెందిన మాజీ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ ఏ  శ్రీలత.. నారాయణపేట కాంగ్రెస్‌‌‌‌ నాయకుడు కుంభం శివకుమార్‌‌‌‌ రెడ్డిపై 2022లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌‌‌ లో, 2023 బెంగళూరులో చేసిన ఫిర్యాదు మేరకు క్రిమినల్‌‌‌‌ కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో ఆయనపై పార్టి పరంగా చర్యలు తీసుకోవాలంటూ పీసీసీకి శ్రీలత ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గతేడాది ఆగస్టు 20న నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్‌‌‌‌ మెట్రోపాలిటన్‌‌‌‌ మేజిస్ట్రేట్‌‌‌‌ కోర్టులో ప్రైవేటు పిటిషన్​ దాఖలు చేశారు. తన పరువుకు నష్టం కలిగించడంతో పాటు, నేరపూరిత కుట్ర, బెదిరింపులు సహా పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు 16 పేజీలతో కూడిన ఫిర్యాదును కోర్టుకు అందించారు.

బాధ్యులైన వారి నుంచి తనకు రూ.10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని పిటిషన్‌‌‌‌లో విజ్ఞప్తి చేశారు. కాగా, శ్రీలత పిటీషన్‌‌‌‌కు కోర్టులో ఎస్‌‌‌‌ఆర్ నంబర్‌‌‌‌‌‌‌‌ కేటాయించిన కోర్టు  ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు కాలేదని తెలిసింది. కాగా, ప్రతివాదులుగా ఉన్న  కుంభం శివకుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, చిట్టెం ప్రియాంక రెడ్డి,  పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్​కుమార్ గౌడ్‌‌‌‌, మీనాక్షి నటరాజన్‌‌‌‌ సహా మొత్తం ఏడుగురి తరఫున వాదనలు జరగనున్నాయి. ఈ వాదనల అనంతరం పిటిషన్​పై విచారణ చేపట్టాలా? వద్దా? అనే విషయమై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.