నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌: కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ, నంది గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండె, కిడ్నీ సంబంధమైన సమస్యలతో ఏప్రిల్‌ 3న ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం సమయంలోనే ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పట్నుంచి చికిత్స పొందుతున్న ఎస్పీవై రెడ్డి ప్రాణాలు విడిచారు.

1977లో ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారంలోకి..

ఎస్పీవై రెడ్డి కడప జిల్లా అంకాలమ్మ గూడూరు గ్రామంలో జూన్ 4, 1950న జన్మించారు. ఎన్‌ఐటీ వరంగల్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. ముంబయిలోని బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిఫిక్‌ అధికారిగా చేరారు. ఆ తర్వాత 1977 ఆ ఉద్యోగానికి ఎస్పీవై రెడ్డి రాజీనామా చేశారు. 1979లో ఒక ప్లాస్టిక్ కంటైనర్ల ఉత్పాదక ప్లాంట్‌ను నెలకొల్పారు. 1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ రంగంలోకి దిగారు.

తొలి అడుగులు భాజపాతో..

ఎస్పీవై రెడ్డి రాజకీయ జీవితం భాజపాతో ప్రారంభమైంది. భాజపా తరఫున 1991 ఎన్నికల్లో కర్నూలు జిల్లా నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల, ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల రెండింటికీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నంద్యాలలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2000లో కాంగ్రెస్ తరఫున నంద్యాల పురపాలక సంఘం ఛైర్మన్‌గా పోటీ చేసి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్‌ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి లక్ష మెజారిటీతో గెలుపొందారు. 2009లోనూ అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి 1.08 లక్షల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన ఆ తర్వాత తెదేపాలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెదేపా టికెట్‌ దక్కకపోవడంతో జనసేనలో చేరి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన కుమారుడు అమెరికా నుండి రావాల్సి ఉన్నందుకు మే 2 వ తేదీ రోజున అంతక్రియలు అవుతాయి అనీ బంధువులు తెలిపారు మృత దేహాన్ని నంద్యాల కి అంబులెన్స్ లో తరలించారు