- చంద్రబాబును దెబ్బతీయడానికి నన్ను టార్గెట్ చేశారు
- ద్రౌపదిని కౌరవులు అవమానించినట్టు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: గత ఏపీ ప్రభుత్వం తన భర్త, సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు అసెంబ్లీలో తన పేరును లాగి, తన శీలం గురించి మాట్లాడిందని నారా భువనేశ్వరి ఆరోపించారు. బుధవారం కుప్పంలోని ద్రౌపది అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. ద్రౌపది అమ్మవారిని కౌరవులు అవమానించిన ఘటనను భువనేశ్వరి గుర్తు చేశారు.
భర్తలను దెబ్బతీయడానికి వేరే మార్గం లేక ఒక మహిళను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. “ధైర్యం ఉంటే మగాడు మగాడిలా నిలబడి మాట్లాడాలి. ఒక స్త్రీని లాగకూడదు. ఒక స్త్రీ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఒక స్త్రీ ఎలాంటిదో ఆమెకు మాత్రమే తెలుసు” అని అన్నారు. ద్రౌపదికి కృష్ణుడు అండగా నిలిచినట్లే, ప్రజలే దేవుళ్లుగా మారి చంద్రబాబు, ఆయన కుటుంబానికి అండగా నిలిచారని భువనేశ్వరి చెప్పారు.
ఇప్పటికీ తమ కుటుంబం నక్సలైట్ల హిట్ లిస్ట్‌లో ఉందని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రజల సేవ కోసమే తమ కుటుంబం ఉందని, స్త్రీలను గౌరవించాలని అన్నారు. స్త్రీ ఒక అమ్మలాంటిదని చెప్పారు. ద్రౌపది అమ్మవారి ఆలయానికి వచ్చిన సందర్భంగా ఈ విషయాలు గుర్తుకు వచ్చి మాట్లాడానని, అంతేతప్ప ఇంతకుముందు ఎక్కడా ఈ విషయంపై మాట్లాడలేదని తెలిపారు.
“నేను ఎలాంటి దాన్నో నా భర్తకు, మీ అందరికీ తెలుసు. నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు” అని భువనేశ్వరి అన్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకపోయినా చంద్రబాబును రాజమండ్రి జైలులో 56 రోజులు ఉంచారని ఆరోపించారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోయారని భువనేశ్వరి అన్నారు.
