మనుషుల్లో నిజాయితీ ఇంకా ఉంది.. దొరికిన రూ.25 లక్షల బంగారం అప్పగింత

మనుషుల్లో నిజాయితీ ఇంకా ఉంది.. దొరికిన  రూ.25 లక్షల బంగారం అప్పగింత

పది రూపాయలు దొరికితే ఠక్కున జేబులో వేసుకుంటాం.. వంద దొరికితే అదో తుత్తి.. కట్టల కట్టలు డబ్బులు దొరికితే.. బంగారం బ్యాగ్ దొరికితే.. అది కూడా దొంగతనం చేకుండా రోడ్డుపై దొరికితే.. బంగారం బ్యాగులో అడ్రస్ కూడా లేకుండా ఉంటే.. ఇన్ని రకాలుగా ప్లస్ పాయింట్స్  ఉంటే కొందరు అయితే ఎగిరి గంతులు వేస్తారు..  ఆ వ్యక్తి మాత్రం అలా చేయలేదు.. ఎవరూ చూడటం లేదని.. అడ్రస్ కూడా లేదని ఊరికే ఉండలేదు.. ఆ బంగారం బ్యాగ్ ను ఎంతో నిజాయితీగా.. నిబద్ధతతో పోలీస్ స్టేషన్ లో అప్పగించి.. వివరాలు ఇచ్చి మరీ వచ్చారు. మనుషుల్లో మానవత్వం ఇంకా ఉందని.. మంచి మనసున్న మనుషులు ఇంకా ఉన్నారని నిరూపితం చేసింది ఈ ఘటన.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సిటీ శివార్లలోని సంగారెడ్డి జిల్లా బీరంగూడెం కమాన్ దగ్గర ఉన్న సాయి భగవాన్ కాలనీలో నివాసం ఉంటున్నారు నిరూప్ అనే వ్యక్తి. ఐటీ కంపెనీలో ఉద్యోగి. విజయవాడలో తన తమ్ముడు నిశ్చితార్థానికి వెళ్లి.. తిరిగి బస్సులో హైదరాబాద్ వచ్చారు. బస్సు దిగి ఇంటికి వెళుతున్న సమయంలో నగల బ్యాగ్ ను పోగొట్టుకున్నాడు నిరూప్. 

ఇదే సమయంలో.. బీరంగూడ సమీపంలోని ఆటో స్టాండ్ దగ్గర నగలు ఉన్న బ్యాగ్ ను గుర్తించాడు బీరంగూడకు చెందిన నరేందర్. బ్యాగ్ తెరిచి చూడగా అందులో నగలు ఉన్నాయి. అడ్రస్ కూడా లేదు. నరేందర్ ఎంతో బాధ్యతతో.. నిజాయతీతో ఆ నగల బ్యాగ్ ను రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ అప్పగించాడు. బ్యాగ్ ను తీసుకున్న సీఐ సంజయ్ కుమార్ విచారణ చేసి.. నగల బ్యాగ్ పోగొట్టుకున్న నిరూప్ ను గుర్తించి బ్యాగ్ అందజేశారు. 

ఈ సమయంలో ఎంతో నిజాయితీతో నగల బ్యాగ్ ను అప్పగించిన నరేందర్ ను పోలీస్ స్టేషన్ లో సీఐ సంజయ్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది నన్మానించారు. బ్యాగులోని నగల విలువ 25 లక్షల రూపాయలు అని.. ఎంతో నిజాయితీతో అప్పగించిన నరేందర్ కు కృతజ్ణతలు తెలిపారు బాధితుడు నిరూప్. మొత్తానికి హైదరాబాద్ మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని.. మనుషుల్లో చాలా మంది మంచోళ్లు ఉన్నారని ఈ ఘటన నిరూపితం చేసింది. మనుషులందు మంచి మనుషులు వేరయా.. అందరూ చెడ్డోళ్లు ఉండరు కదా...