ఉపాధ్యాయ MLC లుగా నర్సిరెడ్డి, రఘోత్తంరెడ్డి విజయం

ఉపాధ్యాయ MLC లుగా నర్సిరెడ్డి, రఘోత్తంరెడ్డి విజయం

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో UTF అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓడిపోయారు. గెలుపు కోసం 9 వేల 14 ఓట్లు రావాల్సి ఉండగా.. నర్సిరెడ్డికి 8 వేల 976 ఓట్లు, పూల రవీందర్ కు 6వేల 279 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 38 ఓట్లు వస్తే.. మొదటి ప్రాధాన్యత ఓట్ల కింద నర్సిరెడ్డి గెలిచేవారు. కానీ.. 38 ఓట్లు తక్కువ రావడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో TRS మద్దతిచ్చిన పూల రవీందర్ పై.. కాంగ్రెస్, వామపక్షాలు మద్దతిచ్చిన నర్సిరెడ్డి ఘన విజయం సాధించారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో మొత్తం 18వేల 885 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 858 ఓట్లు చెల్లలేదు. మొత్తం 18వేల 27 ఓట్లు మాత్రమే చెల్లాయి. ఇందులో.. యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 8వేల 976 ఓట్లు, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ కు 6వేల 279 ఓట్లు.. పీఆర్టీయూ రెబల్ క్యాండిడేట్ సర్వోత్తమ్ రెడ్డికి 18వందల 73 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ లో నర్సిరెడ్డికి 3 వేల 566, పూల రవీందర్ కు 2వేల 547, రెండో రౌండ్ లో నర్సిరెడ్డికి 3 వేల 358, పూల రవీందర్ కు 2వేల 429 ఓట్లు వచ్చాయి. ఇక మూడో రౌండ్ లో నర్సిరెడ్డికి 2వేల 52, పూల రవీందర్ కు… 13వందల 3 ఓట్లు వచ్చాయి. ప్రతీ రౌండ్ లో నర్సిరెడ్డి.. ఓట్లు పెరగ్గా.. పూల రవీందర్ ఓట్లు తగ్గుతూ వచ్చాయి.

సీపీఎస్ అంతం తన పంతం అన్నారు ఎమ్మెల్సీ.. అలుగుబెల్లి నర్సిరెడ్డి. సీఎం హామీ ఇచ్చిన ఐఆర్, పీఆర్సీ ఉపాధ్యాయులకు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి తోడ్పతానని చెప్పారు.

మరోవైపు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి రఘోత్తంరెడ్డి విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి మోహన్ రెడ్డిపై వేయి 707 ఓట్ల తేడాతో గెలుపొందారు. రఘోత్తంరెడ్డికి 7 వేల 505 ఓట్లు,  ప్రత్యర్థి మోహన్ రెడ్డికి 5 వేల 798 ఓట్లు వచ్చాయి.

తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు కేటాయించిన రెండు రౌండ్లలో ఎవ్వరికీ మెజార్టీ రాలేదు.దీంతో ఎలిమినేషన్ పద్ధతిలో కౌంటింగ్ కొనసాగించారు. మొదట అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చిన వేణుగోపాలస్వామి, ఆ తర్వాత చిట్యాల రాములు, పాతూరి సుధాకర్రెడ్డి , కొండల్ రెడ్డి, మామిడి సుధాకర్రెడ్డిలను ఎలిమినేట్ చేశారు. చివరికి రఘోత్తంరెడ్డి కి 7 వేల 505 ఓట్లు, మోహన్ రెడ్డికి 5 వేల 798 ఓట్లు లెక్క తేలాయి. 50 శాతం ఓట్లు రాకున్నా.. 1,707 ఓట్ల మెజారిటీతో రఘోత్తంరెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రఘోత్తంరెడ్డి అనుచరులు సంబురాలు చేసుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల విజయం టీచర్లదే అన్నారు రఘోత్తంరెడ్డి. వ్యక్తుల కంటే సంఘమే గొప్పదని టీచర్లు నిరూపించారని చెప్పారు. పీఆర్టీయూకు ద్రోహం చేసిన వారికి ఈ విజయం చెంపపెట్టు లాంటిదన్నారు.

కౌంటింగ్ ప్రారంభమైన కాసేపటికే సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి అనుచరులతో కలిసి కౌంటింగ్ హాల్ నుంచి బయటికి వెళ్లిపోయారు. గతంలో టీఆర్ఎస్ తరఫున గెలిచిన పాతూరి..ఈసారి పోటీ ఇవ్వలేకపోయారు. మొదట మోహన్ రెడ్డి గెలుస్తాడని అంతా భావించినా.. చివరకు ఉత్కంఠగా సాగిన పోరులో రఘోత్తంరెడ్డి విజయం సాధించారు.