నేషనల్ హెరాల్డ్ కేసు : విచారణకు హాజరుకాని కాంగ్రెస్ నేతలు

నేషనల్ హెరాల్డ్ కేసు : విచారణకు హాజరుకాని కాంగ్రెస్ నేతలు

వెలుగు, ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసును ఈడీ  వేగవంతం చేసింది.  కాంగ్రస్ పార్టీకి అనుంధానమైన ‘యంగ్ ఇండియా’ కంపెనీకి ఎవరు విరాళాలు ఇచ్చారో వారిపై ఈడీ నజర్ పెట్టింది. విరాళాలు ఇచ్చిన వారి జాబితాలో  తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, గాలి అనిల్, అంజన్ కుమార్ యాదవ్, సుదర్శన్ రెడ్డి  విరాళాలు ఇచ్చినట్లు సమాచారం.  విరాళాల అంశంపై విచారణకు రావాలంటూ ఇటీవల వారికి ఈడీ లేఖ రాసింది. 

సోమవారం రోజున ఈడీ విచారణకు షబ్బీర్ అలీ హాజరైనట్లు తెలిసింది. దాదాపు అరగంట పారు ఆయనను విచారించినట్లు సమాచారం. ఈసందర్భంగా యంగ్ ఇండియాకు ఇచ్చిన విరాళాలపై పలు ప్రశ్నలు ఈడీ అధికారులు అడిగినట్లు తెలిసింది.  తాజాగా  మంగళవారం నాడు గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్ ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల వాళ్లు హాజరుకాలేదు. గురువారం రోజున విచారణకు హాజరవుతామని వారు ఈడీ అధికారులకు తెలిపినట్లు సమాచారం.  ఇప్పటికే ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు విచారించారు. 

ఎందుకీ దర్యాప్తు ? 

1937లో నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రిక ఏర్పాటైంది. దాన్ని నష్టాల నుంచి బయటపడేసేందుకు నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే  అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ( ఏజేఎల్) కంపెనీకి కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం ఇచ్చింది. తరువాత ఈ రుణానికి బదులుగా ఏజేఎల్ తన వాటాలలో 99 శాతాన్ని యంగ్ ఇండియా కంపెనీకి బదిలీ చేసింది. యంగ్ ఇండియా కంపెనీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చెరో 38 శాతం వాటాలు ఉన్నాయి. మిగతా 24 శాతం వాటా కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, పాత్రికేయుడు సుమన్ దూబే, పారిశ్రామికవేత్త శాం పిట్రోడాలకు ఉంది. యంగ్ ఇండియా కంపెనీకి అందిన ఏజేఎల్ షేర్లతో సహా యంగ్ ఇండియా ఖాతాలోకి వచ్చిన డబ్బుపై ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతోంది.