న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగులు మే 25,-26 తేదీల్లో చేపట్టాలని భావించిన దేశవ్యాప్త సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ముంబైలోని కార్పొరేట్ సెంటర్‌లో శుక్రవారం బ్యాంక్ యాజమాన్యానికి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో ఫెడరేషన్ లేవనెత్తిన పలు డిమాండ్లపై బ్యాంక్ సానుకూలంగా స్పందించిందని, అందుకే సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఎస్‌బీఐ స్టాఫ్ అసోసియేషన్ బెంగాల్ సర్కిల్ సెక్రటరీ సుదీప్ దత్తా వెల్లడించారు. మెసెంజర్లు, ఆర్మ్‌డ్ గార్డుల రిక్రూట్‌మెంట్‌తో పాటు తగినంత మంది సిబ్బందిని నియమించడం, శాశ్వత ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడాన్ని నిలిపివేయడం, కెరీర్ ప్రొగ్రెషన్ స్కీమ్‌లను సమీక్షించడం, మెడికల్ రీఇంబర్స్‌మెంట్‌ను మెరుగుపరచడం, హెచ్‌ఆర్‌ఎమ్‌ఎస్ సమస్యల పరిష్కారం వంటి 16 ప్రధాన డిమాండ్లతో ఆల్ ఇండియా ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.
