- మాజీ మంత్రి రఘువీరా రెడ్డి వెల్లడి
- 6వ తేదీ నుంచి అన్మాస్‌పల్లిలో విత్తన పండుగ
పంజాగుట్ట, వెలుగు: సహజ సిద్ధ వ్యవసాయంతో ప్రాణి కోటికి మేలు జరుగుతుందని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశీ, సహజ విత్తనాలతో పండించే వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యేక కనీస మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ప్రతి మండలంలో విత్తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాలు కల్తీమయంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీని నివారించేందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను అమలు చేయాలని సూచించారు.
అనంతరం కౌన్సిల్ఫర్గ్రీన్ రెవల్యూషన్ప్రతినిధి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సమాజానికి అందిచడమే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. కల్తీ మందులు, గుళికలు వంటి వాటి వినియోగం తగ్గించి పురాతన వ్యవసాయ పద్ధతులను అమలుచేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. ఈ నెల 6 ,7, 8వ తేదీల్లో రంగారెడ్డి జిల్లా కడ్తాల్మండలం అన్మాస్ పల్లి గ్రామంలోని ‘ది ఎర్త్ సెంటర్’లో తెలంగాణ ద్వితీయ విత్తన పండగ వార్షికోత్సవాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
సంప్రదాయ విత్తన జ్ఞానాన్ని పునరుద్ధరించడానికి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఇది వేదికగా నిలుస్తున్నది. భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ వంటి సంస్థల ఈ ఉత్సవానికి సహకరిస్తున్నాయి. స్వచ్చంద సంస్థలు, వ్యవసాయ నిపుణులు, ప్రజలందరినీ ఈ ఉత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో గ్రీన్ కౌన్సిలింగ్ రెవల్యూషన్ అధ్యక్షుడు లీలా లక్ష్మారెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ రమాదేవి, అడ్వైజర్లు దిలీప్ రెడ్డి, రవీందర్, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
