పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ప్రజలు పట్టం కట్టారు. అభివృద్ధి మంత్రం, సంక్షేమ పథకాల వ్యూహం పక్కాగా పని చేయడంతో ప్రతిపక్ష ఇండియా కూటమి కంచుకోటలు బద్దలయ్యాయి. 'పీపుల్స్ సీఎం'గా పేరున్న ఎన్.రంగస్వామి తన రాజకీయ చతురతను మరోసారి నిరూపించుకున్నారు. ఏఐఎన్‌ఆర్‌సీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు.
ముఖ్యంగా తట్టంచవాడి నియోజకవర్గంలో రంగస్వామి సాధించిన విజయం, ఆయన పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనం. నిరాడంబరత, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలే ఆయనను వరుసగా విజేతగా నిలబెట్టాయి. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఓటర్లు భావించినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎవరెవరికి ఎన్ని సీట్లంటే..
ఏఐఎన్ఆర్ సీ 12 సీట్లు, డీఎంకే 5 సీట్లు, బీజేపీ 4 సీట్లు, టీవీకే 2 సీట్లు గెల్చుకోగా.. కాంగ్రెస్, ఎల్జేకే, అన్నాడీఎంకే, ఎన్ వైఎంకే తలా ఓ స్థానంలో విజయం సాధించాయి. 3 చోట్ల ఇండిపెండెంట్లు గెలుపొందారు.
కమలం వికాసం.. బలపడిన బీజేపీ
ఈ ఎన్నికల్లో బీజేపీ తన ఉనికిని మరింత చాటుకుంది. గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. మన్నాడిపేట నుంచి పోటీ చేసిన కీలక నేత నమశ్శివాయం భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా, పట్టణ ప్రాంతాల్లో కూడా కమలం పార్టీ తన సత్తా చాటింది.
ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకం, కేంద్రం నుంచి అందుతున్న సహకారం పుదుచ్చేరి అభివృద్ధికి దోహదపడతాయన్న ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంది. కూటమిలో భాగంగా బీజేపీ సాధించిన సీట్లు ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలకంగా మారాయి.
ఇండియా కూటమికి ఎదురుదెబ్బ..
పుదుచ్చేరిలో అధికారం దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నించిన కాంగ్రెస్- డీఎంకే కూటమికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ తన పాత ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో విఫలమైంది. అంతర్గత విభేదాలు, బలమైన స్థానిక నాయకత్వం లోపించడం ఇండియా కూటమి పరాజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయ్ ‘టీవీకే' ప్రభావం..
ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) ఎంట్రీ. తొలి ప్రయత్నంలోనే ఈ పార్టీ గణనీయమైన ఓట్లను చీల్చింది. ముఖ్యంగా యువత ఓట్లు టీవీకే వైపు మళ్లాయి. గెలుపోటములను నిర్ణయించే కీలకమైన ఓట్లను ఈ పార్టీ సాధించడంతో, సంప్రదాయ పార్టీలకు కొత్త సవాల్ ఎదురైంది.
