V6 News

మహిళా బిల్లుకు మెజారిటీ గండం... పార్లమెంటులో ఎన్డీయేకు సరిపోని సంఖ్యాబలం

మహిళా బిల్లుకు మెజారిటీ గండం... పార్లమెంటులో ఎన్డీయేకు సరిపోని సంఖ్యాబలం
  • లోక్‌‌సభలో 360, రాజ్యసభలో 163 మ్యాజిక్ ఫిగర్స్
  • ప్రతిపక్షాల వైపు మోదీ సర్కార్ చూపు

న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించుకోవడానికి అధికార ఎన్డీయే కూటమికి తగినంత సంఖ్యాబలం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. ప్రస్తుతం లోక్‌‌సభ(మొత్తం543)లోఎన్డీయేకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. 

ఇది మొత్తం సభలో 54% మాత్రమే. అయితే, రాజ్యాంగ సవరణ కోసం కనీసం 360(మూడింట రెండొంతుల మెజారిటీ) మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే, కాంగ్రెస్ (98 ఎంపీలు), సమాజ్‌‌వాదీ పార్టీ(37), తృణమూల్ కాంగ్రెస్ (28), డీఎంకే (22) వంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో కనీసం రెండు పార్టీలు మద్దతు తెలపడమో, లేదా ఓటింగ్‌‌కు దూరంగా ఉంటే తప్ప ఈ బిల్లు గట్టెక్కడం కష్టం. మరోవైపు వైసీపీ, ఎంఐఎం వంటి పార్టీలు ఇంకా తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు.

రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి

రాజ్యసభ(మొత్తం సభ్యులు 250)లో బిల్లు ఆమోదం పొందడానికి 163 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా.. ఎన్డీయేకు ప్రస్తుతం 141 మంది సభ్యుల బలమే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి పార్టీల 20 మంది సభ్యుల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. లోక్‌‌సభలో బిల్లు వీగిపోతే రాజ్యసభలో ప్రవేశపెట్టే వీలుండదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బిల్లు ఆమోదానికి సహకరిస్తే అందరికీ క్రెడిట్ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. 

ప్రతిపక్షాలు కోరే  సవరణలు, షరతులపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గురువారం లోక్‌‌సభలో రాజ్యాంగ(131వ సవరణ) బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బిల్లు ప్రవేశపెట్టే టైంలో జరిగిన ఓటింగ్‌‌లో 251 మంది అనుకూలంగా, 185 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సంఖ్యాబలం సరిపోకపోవడంతో ఇతర పార్టీలను ఒప్పించడం, లేదా ఓటింగ్‌‌కు దూరంగా ఉంచడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గంగా కనిపిస్తున్నది.