- 3 బ్యారేజీలకు 13 రకాల టెస్టులు చేసినట్టు వెల్లడించిన అధికారులు
- అక్టోబర్ లేదా నవంబర్లో ప్రిలిమినరీ డిజైన్లు ఇస్తామన్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్దామని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఇప్పటివరకు చేసిన టెస్టులు, పునరుద్ధరణకు చేపట్టిన చర్యలపై శుక్రవారం ఢిల్లీలో ఎన్డీఎస్ఏ టెక్నికల్ మెంబర్ సమీర్ కుమార్శుక్లా నేతృత్వంలోని టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ సమావేశం నిర్వహించింది. సీడబ్ల్యూసీ డైరెక్టర్లు, సెంట్రల్ వాటర్అండ్పవర్రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్సాయిల్, మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ల ప్రతినిధులు, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి అధికారులు ఇప్పటివరకు చేసిన టెస్టుల వివరాలపై టన్నెల్ సెక్రటరీ పరీక్షిత్ మెహ్రా ప్రజెంటేషన్ ఇచ్చారు. మూడు బ్యారేజీలకు 13 రకాల పరీక్షలు చేసినట్టు చెప్పారు. కాంక్రీట్ నాణ్యత, నిర్మాణ సమగ్రత తెలుసుకునేందుకు ఎన్డీటీ, రీబౌండ్ హ్యామర్.. బ్యారేజ్ మెటల్ గేట్ల మందం, స్థితిని పరిశీలించే అల్ట్రాసోనిక్ పరీక్షలు, ఫౌండేషన్‌లో సీపేజ్, ప్రెజర్, ఎగ్జిట్ గ్రేడియంట్ తదితర అంశాలపై జియో టెక్నికల్ పరీక్షలు, బ్యారేజ్ బాడీ కాంక్రీట్ బలం తెలుసుకునేందుకు కోర్ శాంపిల్స్ పరీక్షలు చేసినట్లు తెలిపారు.
సీకెంట్ ఫైల్స్ పరిస్థితిని తెలుసుకునేందుకు బోర్ హోల్స్ ద్వారా నమూనాలు సేకరించారు. ర్యాఫ్ట్ కింద గోతులను గుర్తించేందుకు జీపీఆర్ పరీక్షలు చేసినట్టు వివరించారు. హైడ్రాలిక్ మోడల్ స్టడీస్, త్రీడీ స్ట్రెస్ అనాలసిస్ లాంటి పరీక్షలు ఇంకా కొన్ని పూర్తి కావాల్సి ఉన్నట్లు తెలిపారు. చేసిన పరీక్షలు వాటి ద్వారా వచ్చే ఫలితాల గురించి పూర్తిస్థాయిలో ఆరా తీసిన సమీర్ కుమార్ శుక్లా.. ఆ పరీక్షలు పునరుద్ధరణ డిజైన్ కోసం ఏ మేరకు ఉపయోగపడతాయని రాష్ట్ర అధికారులను, ఆఫ్రీ ఇండియా ప్రతినిధుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
అక్టోబర్ లేదా నవంబర్నాటికి ప్రిలిమినరీ డిజైన్లు సిద్ధమవుతాయని అధికారులు తెలపగా.. ఒకేసారి ఫైనల్ డిజైన్స్ ఇవ్వాలని సమీర్ సూచించినట్టు తెలిసింది. మూడు ఆనకట్టల పునరుద్ధరణకు పరస్పర సహకారంతో పనిచేద్దామని చెప్పినట్లు తెలిసింది. పరీక్షల ఫలితాలను విశ్లేషించిన తర్వాత పక్కా ప్రణాళికతో రావాలని రాష్ట్ర అధికారులకు సూచించినట్లు సమాచారం. ఇందుకు రెండు, మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అనంతరం టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో నీటి నిల్వ అంశం చర్చకు రాలేదని తెలిసింది. కాగా, అన్నారంలో సమస్యలున్నాయని గుర్తించినట్టు ఎన్డీఎస్ఏకి అధికారులు వివరించినట్టు సమాచారం.
