డాక్టర్ కావాలని కలలు కన్నాడు: నీట్ ఎగ్జామ్‌కు ముందే ఆత్మహత్య

డాక్టర్ కావాలని కలలు కన్నాడు: నీట్ ఎగ్జామ్‌కు ముందే ఆత్మహత్య

చెన్నై: తమిళనాడులోని సేలంలో పెద్ద డాక్టర్ కావాలని కలలు కన్న ఓ స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంబీబీఎస్‌లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్‌ ఎగ్జామ్‌కు కొన్ని గంటల ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక సాధారణ రైతు కూలీ బిడ్డ అయిన ధనుష్ అనే 19 ఏండ్ల కుర్రాడు డాక్టర్ కావాలన్న ఆశతో గతంలో రెండు సార్లు నీట్ పరీక్ష రాశాడు. కానీ క్వాలిఫై కాలేకపోయాడు. ఈ ఏడాది సమ్మర్‌‌లోనే జరగాల్సిన నీట్ ఎగ్జామ్‌.. కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆదివారం (సెప్టెంబర్ 12న) మధ్యాహ్నం దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా సెంటర్లలో పరీక్షను నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇవాళ ఎగ్జామ్ రాయాల్సిన ధనుష్ మళ్లీ క్వాలిఫై అవుతానో లేదోనన్న మానసిక ఒత్తిడితో పరీక్ష సమయానికి కొన్ని గంటల ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ధైర్యం కోల్పోవద్దని పిలుపునిచ్చిన సీఎం స్టాలిన్

ధనుష్ ఆత్మహత్య వార్త తెలిసిన తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. దయచేసి విద్యార్థులెవరూ ధైర్యం కోల్పోవద్దని కోరారు. నీట్‌కు వ్యతిరేకంగా రేపు (సోమవారం) అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. దీనికి మద్దతుగా మిగిలిన రాష్ట్రాల సీఎంలుకు కూడా ముందుకొస్తారని ఆశిస్తున్నానని స్టాలిన్ చెప్పారు. విద్యా శాఖను మళ్లీ రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరాన్ని ఈ విద్యార్థి ఆత్మహత్య గట్టిగా నొక్కి చెబుతోందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఆ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

పదేండ్లు నీట్ పరిధిలో లేని తమిళనాడు

గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలోనే నీట్ అమలులోకి వచ్చినప్పటికీ నాడు డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎంగా ఉన్న దివంగత కరుణానిధి ఆ రాష్ట్రాన్ని నీట్‌ పరిధిలోకి రాకుండా చేసేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దాదాపు పదేండ్ల పాటు నీట్‌ను ఆ రాష్ట్రంలో లేకుండా చేసి, లోకల్ విద్యార్థులకే సీట్లు ఇచ్చేలా రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఎంట్రెన్స్ నిర్వహించుకున్నారు. అయితే ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశమంతా ఒకేలా నీట్‌ పరీక్ష ఉండేలా చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ గత అన్నాడీఎంకే సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా లాభం లేకపోయింది. అయితే మరోసారి తమిళనాడుకు నీట్‌ నుంచి మినహాయింపు పొందేందుకు తాజాగా స్టాలిన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.