ఇన్​స్పిరేషన్ : హింగ్​ కింగ్‌‌ ఎల్‌‌.జి. 

ఇన్​స్పిరేషన్ : హింగ్​ కింగ్‌‌ ఎల్‌‌.జి. 

ఎల్‌‌.జి. అనగానే అందరికి సౌత్‌‌ కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ గుర్తొచ్చిందా! కానీ... రోజూ వంట చేసేవాళ్లకు మాత్రం ఎల్‌‌.జి. అనగానే ఠక్కున ‘ఇంగువ’ కళ్లముందు మెదులుతుంది. వంటింట్లో అంత ఫేమస్‌‌... ఈ బ్రాండ్‌‌. ముఖ్యంగా సౌత్‌‌ ఇండియాలోని చాలా కిచెన్​ షెల్ఫ్​ల్లో ఎల్‌‌.జి.కి ఒక స్పెషల్​ ప్లేస్​  ఉంటుంది. కిచెన్‌‌లో అమ్మ పెట్టే సాంబార్ వాసన వీధి చివర ఉన్న ఇంటి తలుపు తట్టినా,  పులిహోర ఘుమఘుమలు పిలిచినా కారణం ఎల్‌‌.జి. ఇంగువే అంటే అతిశయోక్తి కాదు. 

ఇంగువని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వాడతారు. తమిళనాడు ప్రాంతంలో వాడకం మరీ ఎక్కువ. ఇప్పుడంటే ఇంగువను చాలా కంపెనీలు తయారుచేస్తున్నాయి. కానీ.. దాదాపు వందేండ్ల కంటే ముందు నుంచే ఒక కంపెనీ క్వాలిటీ ఇంగువని మార్కెట్‌‌లో అమ్ముతోంది. అదే లాల్‌‌జీ గోధూ అండ్‌‌ కో. ఈ కంపెనీ1894లో మొదలైంది. 

ముంబయికి చెందిన లాల్జీ గోధూ1890కి ముందు స్టాక్ ట్రేడింగ్ చేసేవాడు. కానీ.. అందులో చాలా నష్టపోయాడు. వేరే బిజినెస్‌‌లు కొన్ని ట్రై చేశాడు. అవేవీ సక్సెస్‌‌ కాకపోవడంతో నష్టాల్లో మునిగిపోయాడు. సరిగ్గా అదేటైంలో1890లో కాబూల్‌‌కు చెందిన ఒక పఠాన్‌‌ని కలిశాడు. అతను కాబూల్ నుంచి కొన్ని మసాలా దినుసులు, డేట్స్‌‌, డ్రై ఫ్రూట్స్, ఇంగువ తీసుకొచ్చాడు. అలా రెగ్యులర్‌‌‌‌గా వాటిని తెచ్చి ముంబయిలోని సంపన్నులకు అమ్మి వెళ్తుండేవాడు.

ఆ పఠాన్‌‌ని కలిసిన లాల్జీ అతను తెచ్చిన వస్తువులకు ఉన్న డిమాండ్‌‌, వాటి అమ్మకాల గురించిన వివరాలు పూర్తిగా తెలుసుకున్నాడు. అప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న లాల్జీకి ఇంగువ బిజినెస్‌‌ చేస్తే లాభాలు వస్తాయి అనిపించింది. అందుకే ఈసారి ఇంగువతో తన లక్‌‌ని పరీక్షించుకోవాలి అనుకున్నాడు. అయితే ఈసారి మాత్రం ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా వ్యాపారం మొదలుపెట్టాలని డిసైడ్‌‌ అయ్యాడు. 

ఇలా మొదలైంది

‘లాల్జీ గోధూ అండ్‌‌ కో’ పేరుతో ఒక కంపెనీని 1894లో మొదలు పెట్టాడు. పెట్టుబడి తగ్గించుకునేందుకు దక్షిణ ముంబయి, మస్జిద్ బందర్‌‌లోని తన ఇంట్లో ఒక గదిలో ప్రొడక్షన్ మొదలుపెట్టాడు. ముందు దిగుమతి చేసుకున్న లవంగాలు, కర్పూరం అమ్మాడు. ఆ తర్వాత ఇంగువ అమ్మకాలు స్టార్ట్​ చేశాడు. మొదట్లో ఆ ఉత్పత్తులను ముంబయిలో మాత్రమే అమ్మేవాడు.

తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరించాడు. అయితే ఆయన కంపెనీ మొదలుపెట్టినప్పుడు ఇంత సక్సెస్‌‌ అవుతుందని, అతని పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడు మొదలుపెట్టిన ఈ కంపెనీని ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన ఆరో తరం నడుపుతోంది.

దక్షిణాదికి...

లాల్జీ కొడుకు ఖిమ్జీ లాల్జీ చేతికి 1920ల్లో కంపెనీ పగ్గాలు వచ్చాయి. ఆయన దక్షిణాదిలో కూడా ఎల్‌‌జీ ఇంగువని మార్కెట్‌‌ చేయడం మొదలుపెట్టాడు. అదే దశాబ్దంలో కంపెనీ తమిళనాడులోని నాగపట్నంలో ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసింది.1940ల నాటికి మెటల్‌‌ బాక్స్‌‌ల్లో ఇంగువ ముద్దలను ప్యాక్‌‌ చేయడం మొదలుపెట్టారు. దాంతో అమ్మకాలు పుంజుకున్నాయి. ఆ తర్వాత కంపెనీ పేరు దేశమంతా తెలిసిపోయింది. కంపెనీ ఫేమస్ కావడంతో1960ల్లో ఎల్‌‌.జి పేరుతో నకిలీ ప్రొడక్ట్స్‌‌ మార్కెట్‌‌లోకి వచ్చాయి.

అయినా.. ఎల్‌‌.జి. బ్రాండ్‌‌కు డిమాండ్ పెరుగుతూనే వచ్చింది. అందుకే ప్రొడక్షన్‌‌ పెంచడానికి అధునాతన మెషిన్లు, టెక్నాలజీ తీసుకొచ్చారు.1970ల్లో రోజుకు150 కిలోల హింగ్‌‌ని ప్రాసెస్ చేయగల సిగ్మా మోటార్ మిక్సర్ తెచ్చారు. ఆ తర్వాత చెన్నయ్, కుంభకోణం, నాసిక్‌‌లలో కూడా ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టారు. ఆ తర్వాత కూడా ప్రాసెసింగ్ టెక్నాలజీని అప్‌‌గ్రేడ్‌‌ చేశారు.1990ల్లో ప్రొడక్షన్‌‌ కెపాసిటీని ప్రతి 40 నిమిషాలకు వెయ్యి కిలోలు ప్రాసెస్‌‌ చేసేలా పెంచారు.  

ఇంగువ పొడి‌‌

ఎల్‌‌.జి.1978 వరకు ఇంగువ ముద్దలు అమ్మేది.1978 నుంచి పౌడర్​ను తెచ్చింది. కంపెనీ పెట్టిన సుమారు 80 ఏండ్లకు ఈ ఘనత సాధించింది. మైసూరులోని సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ టెక్నలాజికల్ ఇనిస్టిట్యూట్ డెవలప్ చేసిన ప్రాసెసింగ్ టెక్నిక్‌‌ల సాయంతో ఇంగువ పొడిని మార్కెట్​లోకి తెచ్చారు. అందుకే ఈ ఇనిస్టిట్యూట్‌‌లోని బెస్ట్ యంగ్‌‌ సైంటిస్ట్‌‌కు ప్రతి ఏడాది ఎల్‌‌.జి. వార్షిక అవార్డు ఇస్తోంది. 

పౌడర్ వేరియెంట్‌‌ తెచ్చిన తర్వాత కంపెనీ బాగా డెవలప్ అయ్యింది. అంతకుముందు ఇంగువ వాడాలంటే.. ముద్దలను పొడి చేసేందుకు రోట్లో వేసి రుబ్బేవాళ్లు. అందుకు చాలా టైం పట్టేది. పౌడర్‌‌‌‌ వచ్చాక ఆ శ్రమ లేకుండా పోయింది. దాంతో వాడకం పెరిగి, సేల్స్ కూడా పెరిగాయి. ప్రస్తుతం కం పెనీ ఇంగువని 50 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు సీసాలు, ప్యాక్స్​లో పొడి, ముద్దలుగా అమ్ముతోంది.

ప్రొడక్షన్ ప్లాంట్స్‌‌ 

అప్పట్లో ముంబైలో పెట్టిన ప్లాంట్‌‌లోనే క్వాలిటీ చెకింగ్‌‌ కోసం సొంత ల్యాబొరేటరీ ఏర్పాటు చేసుకున్నారు. మిగతా యూనిట్లలో ప్రొడక్షన్, ప్యాకేజింగ్‌‌ చేస్తున్నారు. ఇంగువ తయారుచేయడానికి అవసరమైన ముడిసరుకులో దాదాపు 65 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ముఖ్యంగా కజకిస్తాన్‌‌లోని ‘ఆల్మటీ’ నుంచి దిగుమతి అవుతోంది. ఇప్పుడు బెస్ట్‌‌ క్వాలిటీ ముడి ఇంగువ కిలోకు ఇరవై వేలకు పైగానే పలుకుతోంది. సూడాన్‌‌ నుంచి అరబిక్ గమ్‌‌ దిగుమతి చేసుకుంటున్నారు. ఎల్‌‌.జి. అండ్‌‌ కో అన్ని యూనిట్లకు ఎఫ్‌‌.ఎస్‌‌.ఎస్‌‌.ఏ.ఐ., యు.ఎస్‌‌.ఎఫ్‌‌.డి.ఎ. పర్మిషన్ ఉంది.

అన్ని ప్లాంట్లలో లేటెస్ట్‌‌ ఆటోమేషన్, పాటిస్తున్న శుభ్రత ప్రమాణాల వల్ల కల్తీ జరగదు. ప్రొడక్ట్స్ క్వాలిటీ అన్ని ప్లాంట్లలో ఒకేలా ఉంటుంది. అంతేకాదు.. దక్షిణ భారతంలో జరిగే అమ్మకాల్లో 70 శాతానికి పైగా వాటా ఎల్‌‌.జి.దే. గుజరాత్, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎల్​.జి.కి ఇండియాలో దాదాపు వెయ్యిమందికి పైగా స్టాకిస్ట్‌‌లు, డిస్ట్రిబ్యూటర్లు, డిపో ఏజెంట్లు ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఇంగువ ఉత్పత్తిదారుల్లో ఇది కూడా ఒకటి. అమెరికా, బ్రిటన్‌‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, యూఏఈ, మలేసియా, సింగపూర్‌‌లకు ఇంగువతో పాటు కంపెనీ ఇతర ప్రొడక్ట్స్‌‌ కూడా ఎగుమతి చేస్తోంది. మొత్తం టర్నోవర్‌‌లో ఎగుమతుల వాటా 20 శాతం.

ఇప్పుడు ఆరో తరం 

ప్రస్తుతం కంపెనీని లాల్జీ గోధూ కుటుంబానికి చెందిన ఆరో తరం నడుపుతోంది. ఈ కంపెనీ ముంబయిలో వార్షిక ‘కాలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్, హిందుస్తాన్ టైమ్స్ నో టీవీ డే వీకెండ్ ఫెస్ట్’ లాంటి ఈవెంట్స్‌‌ స్పాన్సర్ చేసింది. కానీ.. దాని ప్రొడక్ట్స్‌‌ని మార్కెట్‌‌ చేయడానికి అడ్వర్టైజ్​మెంట్స్​ మాత్రం పెద్దగా ఇవ్వదు. ప్రొడక్ట్‌‌ క్వాలిటీ బాగుండడంతో సేల్స్‌‌ పెరుగుతూనే ఉన్నాయి. 

లాల్జీ గోధూ మునిమనవడు బిమల్ మర్చంట్ మాట్లాడుతూ ‘‘మా ప్రొడక్ట్​ క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్‌‌ కాలేదు. అందుకే ఇంత కాలం నుంచి మార్కెట్‌‌లో ఉండగలిగాం. మా ప్రొడక్షన్‌‌ కోసం బెస్ట్ గ్రేడ్ ముడి పదార్థాలను మాత్రమే వాడతాం. ప్రతి నెలా నేనే స్వయంగా వెళ్లి ముడి ఇంగువ కొంటా” అని చెప్పాడు. అంతలా జాగ్రత్తలు తీసుకోవడం వల్లే కంపెనీ వార్షిక టర్నోవర్‌‌ మూడేళ్లలో రెట్టింపు అయ్యి 400 కోట్లకు చేరింది. 

కొత్త వ్యాపారాలు

చాలా ఏండ్ల పాటు ఇంగువ మాత్రమే అమ్మిన ఎల్.జి. కంపెనీ కొన్నేండ్ల క్రితం మసాలాలు తెచ్చింది. ఈ మధ్య కారం పొడి, పసుపు లాంటివి కూడా మార్కెట్‌‌లోకి వచ్చాయి. ఇప్పుడు ధనియాల పొడి, కారం, కాశ్మీర్‌‌‌‌చిల్లీ, సాంబార్, రసం పౌడర్లు‌‌, బిర్యానీ, చికెన్, మటన్‌‌, గరం మసాలాలు కూడా అమ్ముతోంది. 

కల్తీ ఈజీ!

ఇంగువని ఈజీగా కల్తీ చేయొచ్చు. అందుకే చాలామంది ఇంగువలో బార్లీ లేదా సుద్ద కలిపి కల్తీ చేస్తుంటారు. కల్తీ చేయడమే కాదు.. నకిలీ కూడా పెద్ద సమస్య. చాలామంది పెద్ద కంపెనీల బ్రాండ్‌‌ వ్యాల్యూని వాడుకోవడానికి నకిలీ ప్రొడక్ట్‌‌ కూడా మార్కెట్‌‌లో అమ్ముతుంటారు. కాబట్టి ఎల్​.జి. కంపెనీ లోగోలు, రంగులు, ప్యాకేజింగ్‌‌ని కాపీ కొట్టి నకిలీ ప్రొడక్ట్‌‌ తయారుచేసే అవకాశం ఉంది. అందుకే ప్రొడక్ట్ కొనేముందు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి కల్తీలను అడ్డుకునేందుకు, నకిలీలను నివారించేందుకు కూడా కంపెనీ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. 

ఎలా తయారు చేస్తారు?

ముడి ఇంగువని ‘ఎసఫోటిడ’ అంటారు. మన దేశంలో ఇంగువని ‘కాంపౌండెడ్‌‌ ఎసఫోటిడా, హింగ్‌‌’ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఒక రకమైన రెజిన్‌‌(రబ్బరు పాలలా ఉంటుంది). దీని వాసన గాఢంగా ఉంటుంది. ఈ రెజిన్‌‌ని అఫ్గానిస్తాన్, కజకిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్‌‌లోని చల్లని పర్వతాల్లో పెరిగే ‘ఫెరులా ఎస-ఫోటిడా’ అనే మొక్క నుంచి సేకరిస్తారు. ఆ తర్వాత గడ్డ కట్టేవరకు ఆరబెడతారు. ఒక్కో మొక్క ఏడాదికి కేవలం 500 గ్రాముల దిగుబడి మాత్రమే ఇస్తుంది. అలాంటి ముడి ఇంగువని కంపెనీలు కొని ప్రాసెస్‌‌ చేస్తాయి.

అందుకే అందులో బియ్యప్పిండి/గోధుమ పిండి, అరబిక్ గమ్ (అకాసియా చెట్టు నుండి తీసే తినే గమ్) కలిపి గాఢత తగ్గిస్తారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చెప్తుంటారు పెద్దవాళ్లు. జీర్ణక్రియ, నరాల సమస్యలను తగ్గించడంలో ఇంగువ సాయపడుతుందని ఆయుర్వేదంలో ఉంది. ఉబ్బసం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌‌ను తగ్గించడానికి ఔషధంగా కూడా పనిచేస్తుందని చెప్తారు.