
- ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు
- మండే టు ఫ్రైడే స్టేట్ ఆఫీస్ లో అవైలబుల్
- ఏ రోజు ఎవరు ఆఫీసులో ఉంటారో లిస్ట్ రిలీజ్
- గాంధీభవన్ ను ఫాలో అవుతున్న బీజేపీ
- రెండు జాతీయపార్టీలలో నయా ట్రెండ్
హైదరాబాద్: ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలకు చేరువై వారి సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్‌లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజాప్రతినిధులు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండేందుకు కాంగ్రెస్ ఎంచుకున్న విధానాన్ని బీజేపీ కూడా ఫాలో అవుతోంది. మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు గాంధీభవన్ లో అందుబాటులోఉంటూ పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరిస్తూ పరిష్కార మార్గాలు చూపుతున్నారు. ఏ రోజు ఎవరు అందుబాటులో ఉంటారనేది ముందస్తుగానే సమాచారం ఇస్తూ వస్తున్నారు. మంత్రులు అందుబాటులో లేని రోజుల్లో కార్పొరేషన్ల చైర్మన్స్ కూడా అర్జీలు స్వీకరిస్తున్నారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు, వైద్య సాయం, భూములు, రెవెన్యూ సంబంధిత సమస్యలపై వినతులు వస్తున్నాయి.
విజ్ఞాపనలు అందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ప్రజలు గాంధీభవన్ వద్ద క్యూ కడుతున్నారు. ప్రజల్లో ఉండేందుకు ఈ ఫార్ములా కరెక్ట్ అని భావిస్తున్న కమల నాథులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజు ఏ ప్రజాప్రతినిధి అందుబాటులో ఉంటారనే అంశాలను వెల్లడిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం మొదటి అంతస్తులోని రూం నంబర్ 102లో ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపింది. ఈ నెల 16(సోమవారం) నుంచి అందుబాటులో ఉంటారని తెలిపింది. 16న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, 17న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, 18న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, 19న ఎమ్మెల్సీ అంజిరెడ్డి, 20న రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య అందుబాటులో ఉంటారని తెలిపింది.