
ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2023-25)ను సౌతాఫ్రికా గెలుచుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఫైనల్లో మట్టికరిపించి 27 ఏళ్ళ తర్వాత తొలిసారి ఐసీసీ టైటిల్ ను ముద్దాడింది. లార్డ్స్ వేదికగా శనివారం (జూన్ 14) ఆస్ట్రేలియాతో ముగిసిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మార్కరం, బవుమా రెండో ఇన్నింగ్స్ లో భారీ భాగస్వామ్యంతో పాటు బౌలర్లు రెండు ఇన్నింగ్స్ ల్లో అద్భుతంగా రాణించడంతో ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయంతో సౌతాఫ్రికా టెస్ట్ కెప్టెన్ బవుమా టెస్ట్ క్రికెట్ లో ఏకంగా 104 ఏళ్ళ రికార్దును బ్రేక్ చేయడం విశేషం.
టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజయం ద్వారా బవుమా ఓటమి లేని కెప్టెన్ గా నిలిచాడు. ఓవరాల్ గా 10 టెస్టుల్లో కెప్టెన్సీ చేసిన ఈ సఫారీ కెప్టెన్ 9 విజయాలు.. ఒక డ్రా తో 90 శాతం విజయాలను సాధించాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో ఓటమి లేకుండా కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన అరుదైన రికార్డును బవుమా నెలకొల్పి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతకముందు ఆస్ట్రేలియా కెప్టెన్ వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేరిట ఉంది. 1902-1921 మధ్య కాలంలో ఆర్మ్‌స్ట్రాంగ్ 10 టెస్ట్ మ్యాచ్ ల్లో కెప్టెన్ గా చేసి 8 విజయాలు, 2 డ్రాలతో టాప్ లో ఉన్నాడు. తాజాగా టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవడంతో ఈ రికార్డును బవుమా బ్రేక్ చేసి అగ్ర స్థానంలోకి దూసుకెళ్లాడు.
ఈ మ్యాచ్ లో కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ లోనూ బవుమా అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా జట్టు కోసం అసాధారంగా పోరాడాడు. మూడో రోజు ఆటలో భాగంగా మార్కరంతో కలిసి అజేయంగా 143 రన్స్ జోడించి జట్టు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 5 ఫోర్లతో 66 పరుగులు చేసి నాలుగో రోజు ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో ఈ సఫారీ కెప్టెన్ గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించడం ఆకట్టుకుంటుంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మోకాలి పై భాగంలో బవుమాకు గాయమైంది.
పరుగులు తీయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కుంటుకుంటూనే పరుగు తీశాడు. ఎంతో పట్టుదలగా బ్యాటింగ్ చేసి కెప్టెన్ ను అసలైన నిర్వచనంలా మారాడు. ఒకానొక దశలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి రిటైర్డ్ హర్ట్ అవ్వాల్సిందిగా సూచించినా వినకుండా మొండిగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేసి సౌతాఫ్రికా టాప్ స్కోరర్ గా నిలిచిన బవుమా.. రెండో ఇన్నింగ్స్ లో తీవ్ర గాయంలోనూ 66 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టెస్ట్ క్రికెట్లో ఓటమి లేకుండా కెప్టెన్‌గా అత్యధిక విజయాలు:
టెంబా బావుమా (దక్షిణాఫ్రికా) - 9 విజయాలు, 1 డ్రా (2023-2025)
వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (ఆస్ట్రేలియా) - 8 విజయాలు, 2 డ్రాలు (1902-1921)
బ్రియాన్ క్లోజ్ (ఇంగ్లాండ్) - 6 విజయాలు, 1 డ్రా (1949-1976)
చార్లెస్ ఫ్రై (ఇంగ్లాండ్) - 4 విజయాలు, 2 డ్రాలు (1896-1912)
అజింక్య రహానే (భారతదేశం) - 4 విజయాలు, 2 డ్రాలు (2017-2021)
విక్టర్ రిచర్డ్సన్ (ఆస్ట్రేలియా) - 4 విజయాలు, 1 డ్రా (1924-1936)
అలీ బాచర్ (దక్షిణాఫ్రికా) - 4 విజయాలు, 0 డ్రాలు (1965-1970)