- మే 3న దేశవ్యాప్తంగా ఎగ్జామ్
- షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎన్టీఏ
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ చదవాలనే కలతో ఉన్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నీట్ యూజీ–2026 నోటిఫికేషన్ ను ఆదివారం విడుదల చేసింది. మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా పెన్- అండ్ పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఫిబ్రవరి 8 నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలుకాగా.. మార్చి 8 రాత్రి 9 గంటల వరకు గడువు విధించారు. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, వెటర్నరీ, మిలిటరీ నర్సింగ్ కోర్సుల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష జరగనుంది. అప్లికేషన్ ఫీజులు జనరల్ అభ్యర్థులకు రూ.1700, ఈడబ్ల్యూఎస్/ఓబీసీలకు రూ. 1600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.1000గా నిర్ణయించారు. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే మార్చి 10 నుంచి 12 వరకు సవరించుకునే అవకాశం కల్పించారు. అర్హత ఉన్న విద్యార్థులు వెంటనే https://neet.nta.nic.in/ వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.
