- నిలోఫర్ బేగం, ఆమె అనుచరులపై చర్యలు తీసుకోండి
- బాధితులతో కలిసి పీయూసీఎల్ అధ్యక్షురాలు జయవింధ్యాల ప్రెస్ మీట్
బషీర్‌బాగ్, వెలుగు: ఉమెన్ సివిల్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో మహిళలపై లైంగిక దోపిడీ, అక్రమ రవాణా వంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పాతబస్తీ బాబానగర్‌కు చెందిన నిలోఫర్ బేగం నుంచి తమకు ప్రాణహాని ఉందని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులు మహ్మద్ అమీర్ షరీఫ్, అబ్దుల్ వాసీమ్, ఆష్రఫ్ ఉన్నీసా, మహ్మద్ ఇబ్రహీంతో పౌర హక్కుల ప్రజా సంఘం (పీయూసీఎల్) రాష్ట్ర అధ్యక్షురాలు జయవింధ్యాల మాట్లాడారు.
ఉమెన్ సివిల్ రైట్స్ పేరుతో సంఘాన్ని నడుపుతూ యువతులకు ఉద్యోగాలు, మెరుగైన జీవితం ఆశ చూపించి అరబ్ దేశాలు, ముంబై, పుణె వంటి నగరాలకు తరలించి వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బండ్లగూడతో పాటు ఇతర ప్రాంతాల్లో మహిళా సేవా కార్యక్రమాల ముసుగులో అమాయక మహిళలను మోసం చేస్తూ రహస్యంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసు అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ వారు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తూ నిలోఫర్ బేగంకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. రహస్యాలు బయటపెట్టిన బాధితులను హత్య చేసేందుకు ఆమె కొడుకులు, అనుచరులతో కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కంచన్‌బాగ్ పీఎస్‌తో పాటు ఇతర పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన స్పందన లేదని బాధితులు వాపోయారు. మహిళా సేవ ముసుగులో పాతబస్తీలో విస్తరిస్తున్న ఉమెన్ ట్రాఫికింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా ఉమెన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నలుగురు బాధితులకు తక్షణ రక్షణ కల్పించాలని, స్థానిక పోలీసు వ్యవస్థ దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు.
