ఖాట్మండు: నేపాల్ ఎయిర్‌లైన్స్ తమ నెట్‌వర్క్ మ్యాప్‌లో భారత భూభాగమైన జమ్మూకాశ్మీర్ మొత్తాన్ని పాకిస్తాన్‌లో ఉన్నట్లుగా చూపించింది. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో అంతర్జాతీయ సరిహద్దులను వక్రీకరిస్తూ నేపాల్ ఎయిర్‌లైన్స్ ప్రచురించిన నెట్‌వర్క్ మ్యాప్‌పై భారతీయులు నిప్పులు చెరిగారు. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో నేపాల్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి నెట్‌వర్క్ మ్యాప్‌లో చాలా కార్టోగ్రాఫిక్ (పట రూపకల్పన) తప్పులు ఉన్నాయని అంగీకరించింది.
‘మా సోషల్ మీడియా ఛానల్స్‌లో షేర్ చేసిన నెట్‌వర్క్ మ్యాప్‌లో పొరపాటున జమ్మూకాశ్మీర్.. పాకిస్తాన్‌లో ఉన్నట్లుగా కార్టోగ్రాఫిక్ తప్పులు జరిగాయి. ఈ పొరపాటుకు మేం హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం’ అని నేపాల్ ఎయిర్‌లైన్స్ 'ఎక్స్' వేదికగా వివరణ ఇచ్చింది. ఇది తమ సంస్థ, నేపాల్ ప్రభుత్వ అధికారిక వైఖరి కాదని స్పష్టం చేసింది. అయితే, భోజ్‌పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్‌తో పాటు అనేకమంది నెటిజన్లు ఇది కేవలం పొరపాటు కాదని.. కావాలనే చేసిన ఉద్దేశపూర్వక చర్యగా ఆరోపించారు.
నేపాల్ ఆర్థిక వ్యవస్థకు, ఇంధన సరఫరాకు, విపత్తుల సమయంలో భారత్ ఎంతో అండగా ఉంటుందని, ఇలాంటి ఘటనలు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నేపాల్‌లోని ప్రస్తుత ప్రభుత్వం అప్పుడప్పుడు భారత్ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తోందని పలువురు నెటిజన్లు ఆరోపించారు.

