నమ్మించి నట్టేట ముంచుతున్న నేపాలీలు.. ఇళ్లలో పనికి చేరుతారు.. మత్తు మందిచ్చి లూటీ చేస్తారు

నమ్మించి నట్టేట ముంచుతున్న నేపాలీలు.. ఇళ్లలో పనికి చేరుతారు.. మత్తు మందిచ్చి లూటీ చేస్తారు
  • మూడు కమిషనరేట్ల పరిధిలో ఐదేండ్లలో 20కి పైగా చోరీలు, ఒకరి దారుణ హత్య 
  • రిటైర్డ్ ఆఫీసర్లు, వ్యాపారవేత్తలే టార్గెట్
  • రూ. కోట్ల విలువైన బంగారం, నగదు లూటీ
  • నమ్మకంగా పనిలో చేరి మత్తు మందు ఇచ్చి చోరీలు
  • ఇప్పటివరకు 25 మంది అరెస్ట్
  • నేపాలీలను పనిలో పెట్టుకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటున్న పోలీసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు:నగరాన్ని నేపాలీ ముఠాలు వణికిస్తున్నాయి. నమ్మకంగా ఇండ్లలో చేరి, యజమానుల ప్రాణాలు తీస్తూ, కోట్ల విలువైన సంపదను దోచుకెళ్తున్న ఉదంతాలు మూడు కమిషనరేట్ల పరిధిలో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గత ఐదేండ్లలో ఈ ముఠాలు 20కి పైగా భారీ చోరీలకు పాల్పడటమే కాకుండా, అడ్డువచ్చిన ఒకరిని దారుణంగా హత్య చేశాయి. 

రెండేండ్లుగా వీరి దోపిడీలు విపరీతంగా పెరిగాయి. నమ్మకమే పెట్టుబడిగా నగరంలోకి ప్రవేశిస్తున్న ఈ ముఠాల ఆగడాలు స్థానిక ప్రజలను, పోలీసు యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ముఠాలు నగరంలోని ధనవంతులు, రిటైర్డ్  ఉన్నతాధికారులు, పెద్ద వ్యాపారవేత్తలనే టార్గెట్  చేస్తున్నాయి. ఒంటరిగా ఉండే వృద్ధులు, పర్యవేక్షణ లేని ధనిక కుటుంబాలను ఎంచుకొని పని మనుషులుగా, వాచ్‌‌‌‌మెన్‌‌లుగా ఇండ్లలో చేరుతున్నారు. 

యజమానుల దినచర్యను, ఇంట్లోని లాకర్ల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. స్థానికంగా ఉండే తమ తోటి నేపాలీ గ్యాంగ్  సభ్యులతో కలిసి పక్కా స్కెచ్‌‌తో దోపిడీలకు తెగబడుతున్నారు. నమ్మిన వాళ్లే గొంతు కోస్తుండడంతో ఇండ్లలో నేపాలీలను పనికి కుదుర్చుకోవాలంటేనే నగరవాసులు భయపడిపోతున్నారు.

మత్తుమందు కలిపి స్పృహ తప్పించి.. 

కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ దోపిడీల విలువ విస్తుగొలిపేలా ఉంది. ఐదేండ్లలో ఏకంగా 7 కిలోల బంగారం, కోట్ల విలువ చేసే అత్యంత వజ్రాభరణాలను అపహరించారు. బంగారమే కాకుండా 35 నుంచి 40 కిలోలకు పైగా వెండి వస్తువులను, పూజా సామగ్రిని ఎత్తుకెళ్లారు. వీటితో పాటు రూ.1.5 కోట్ల నగదు, 5 వేల యూఎస్  డాలర్లను లూటీ చేశారు. 

ఈ భారీ సొత్తంతా యజమానులను మత్తు మందుతో స్పృహ తప్పించి లేదా బంధించి దోచుకెళ్లినవే. ఇంట్లోని వారు గాఢనిద్రలో ఉన్నప్పుడు లేదా కాపలా లేని టైంలో ఆహారంలో మత్తుమందు కలిపి చోరీ చేస్తున్నారు. ఆ సమయంలో ఎవరైనా నిద్రలేచి అడ్డుపడితే కనికరం లేకుండా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటివరకు ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు వేడుకోవడంతో వదిలిపెట్టారు. క్రైమ్  చేసిన వెంటనే సదరు ముఠా సభ్యులు సెల్‌‌ఫోన్లు స్విచ్చాఫ్  చేసి, పక్కా ప్లాన్  ప్రకారం నేపాల్  చేరుకునేందుకు రైళ్లు లేదా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

హైదరాబాద్​లోనే ఎక్కువ చోరీలు.. 

హైదరాబాద్ లో  గేటెడ్  కమ్యూనిటీలు, విల్లాలు ఎక్కువగా ఉండడం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్​తో పాటు ఐటీ కారిడార్​లో సంపన్నులు ఉండడంతో పని మనుషుల అవసరం ఎక్కువగా ఉంటోంది. నేపాల్  నుంచి వచ్చే వారు స్థానిక కార్మికులతో పోలిస్తే తక్కువ జీతాలకే ఎక్కువ గంటలు పని చేయడానికి సిద్ధపడుతుండడంతో వారిని చేర్చుకుంటున్నారు. 

ఇక్కడ హిందీ మాట్లాడే వారు కూడా ఎక్కువగా ఉండడం, భాషతో ఇబ్బంది లేకపోవడంతో చెన్నై, బెంగళూరు కాకుండా హైదరాబాద్ ను ఎంచుకుంటున్నారు. వరుస చోరీలతో గత నెల17 నుంచి ఈ నెల 6 వరకు మల్కాజ్‌‌గిరి కమిషరేట్  పరిధిలో డోర్ -టు -డోర్  వెరిఫికేషన్‌‌ చేయగా, 1,276 మంది మంది నేపాలీలు పని మనుషులుగా ఉన్నట్లు తేలింది. మల్కాజిగిరి పరిధిలోనే ఇంత మంది ఉంటే హైదరాబాద్, సైబరాబాద్​లో వేల సంఖ్యలోనే ఉంటారని అనుకుంటున్నారు. 

ఇప్పటివరకు 25 మంది అరెస్ట్​

ఇప్పటివరకు జరిగిన దొంగతనాలు, దోపిడీల్లో పాల్గొన్న 25 మంది నేపాలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కొంత మేర చోరీ సొత్తును రికవరీ చేసినప్పటికీ, కీలక సూత్రధారులు నేపాల్‌‌కి పారిపోతుండడం సవాల్‌‌గా మారింది. పట్టుబడిన వారిని విచారించగా, వారు నేపాల్​లోనూ పలు దోపిడీల్లో పాల్గొన్నట్లు తేలింది. దీంతో పోలీసులు తమకు సమాచారం ఇవ్వకుండా నేపాలీలను పనిలో పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 

నేపాలీ ముఠాల భారీ దోపిడీలు ఇవే..
    
జూన్ 9: గచ్చిబౌలి(హిల్‌‌  రిడ్జ్  విల్లాస్) వ్యాపారవేత్త కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో మాస్టర్  కీస్‌‌తో లాకర్లు తెరిచి రూ. 4 నుంచి 5 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
    
మే 13:  జవహర్‌‌నగర్(గోల్ఫ్  ఎన్‌‌క్లేవ్, కౌకూర్)లోని రిటైర్డ్  ప్రొఫెసర్  వృద్ధ దంపతులకు బర్త్‌‌డే వేడుకల పేరుతో మత్తుమందు ఇచ్చి, కట్టేసి లూటీ. 60 నుంచి -70 తులాల బంగారం, 15 కిలోల వెండి, రూ. 30 వేలు చోరీ. ఈ కేసులో మల్కాజ్‌‌గిరి పోలీసులు నేపాల్  బోర్డర్  వద్ద నేపాలీ దంపతులను అరెస్ట్ చేయగా, మరి కొందరు పరారీలో ఉన్నారు.
    
మే 8:  జూబ్లీహిల్స్(ప్రశాసన్ నగర్) రిటైర్డ్  ఐపీఎస్  వినయ్ రంజన్  రాయ్  భార్య తనూజ ఒంటరిగా ఉండగా, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణ హత్య. కిలోల కొద్దీ బంగారం, కోట్ల విలువైన నగదు చోరీ.  ప్రధాన నిందితురాలు, వంట మనిషి కల్పన పూణేలో అరెస్ట్. 
    
ఫిబ్రవరి 5:  జూబ్లీహిల్స్ లోని ఓ  సంపన్న కుటుంబం(ఎలైట్ హోమ్) వాచ్‌‌మెన్, వంటవాడికి ఆహారంలో మత్తుమందు కలిపి గ్యాంగ్ సభ్యులను ఇంట్లోకి రప్పించి చోరీ. రూ. 1.3 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాల దొంగతనం. ఐదుగురు నిందితుల అరెస్ట్.  
    
2025, నవంబర్: సైబరాబాద్  పరిధిలోని ఐటీ వ్యాపారవేత్త ఇంట్లో పనిలో చేరిన రెండు వారాల్లోనే నమ్మకంగా పని చేసినట్లు నటించి ఇంటి లాకర్ల తాళాలు దొంగిలించి 50 తులాల బంగారం  రూ. 5 లక్షల నగదు చోరీ. అంతరాష్ట్ర నేపాలీ గ్యాంగ్‌‌కు చెందిన ముగ్గురిని ఢిల్లీ రైల్వే స్టేషన్‌‌లో పట్టుకున్నారు.
    
తాజాగా గచ్చిబౌలిలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన చోరీ కేసులో రూ. 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.