రూ.8 లక్షల లెదర్ కోటు వేసుకున్నా.. క్యాబ్ దొరుకుడు కష్టం!

రూ.8 లక్షల లెదర్ కోటు వేసుకున్నా.. క్యాబ్ దొరుకుడు కష్టం!
  • రూ.13 వేల కోట్లు ఎగ్గొట్టి పరారైన నీరవ్ మోడీపై సోషల్ మీడియాలో పంచులు

లండన్: భారత్ కు మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరస్థుడు. బ్యాంకులకు టోపీ వేసి.. దేశం వదిలి పరారయ్యాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ వల పన్ని వెతుకుతున్నా.. దొరకలేదు. దాదాపు ఏడాది తర్వాత ఇవాళ లండన్ వీధుల్లో షికారు కొడుతూ కనిపించాడు. అక్కడి ‘ది టెలిగ్రాఫ్’ మీడియా సంస్థ జర్నలిస్టు అతడిని చూసి.. అది ఎవరో కాదు.. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోడీ అని గుర్తుపట్టాడు.

నీరవ్ నాడు.. నేడు

ఇండియా విడిచి వెళ్లిన టైంలో మీసం లేకుండా క్లీన్ షేవ్, నెత్తిన నాలుగు వెంట్రుకలతో ఉండేవాడు. ఇప్పుడు కొంచెం జుట్టు పెంచాడు. కొత్తగా మీసకట్టు, గడ్డంతో కంప్లీట్ గా లుక్ మార్చేశాడు. దీని వల్ల అతడిని గుర్తుపట్టడం కొంచెం కష్టమైంది. అది నీరవ్ మోడీనే అని కన్ఫమ్ చేసుకున్నాక.. ది టెలిగ్రాఫ్ జర్నలిస్టు వదల్లేదు. వెంటబడి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. కానీ నీరవ్ అన్నింటికీ సారీ.. నో కామెంట్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి జారుకోవాలని నడక స్పీడ్ పెంచాడు. రోడ్డు పక్కన ఉన్న క్యాబ్ ను దొరకబట్టాలని చూశాడు. కానీ క్యాబ్ డ్రైవర్ రానంటూ ఝలక్ ఇచ్చాడు. ఇదేంట్రా బాబు అనుకుంటూ మరో క్యాబ్ పట్టుకుని అక్కడి నుంచి తుర్రుమన్నాడు నీరవ్.

ప్రపంచంలోనే కాస్ట్లీ కోటుపై సెటైర్లు

నీరవ్ మోడీని ప్రశ్నించడం, అతడు వెళ్లిపోవడం.. మొత్తాన్ని ది టెలిగ్రాఫ్ వీడియో తీసి, విడుదల చేసింది. ఇందులో అతడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆస్ట్రిచ్ హైడ్ కోటు వేసుకుని కనిపించాడు. దీని విలువ దాదాపు రూ.8 లక్షలు ఉంటుంది. ప్రపంచంలో అత్యంత దృఢమైన లెదర్ ఇది. అయితే సున్నితంగా, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఫుల్ గా నేచురల్ ఆయిల్ తో ఉండే ఆస్ట్రిచ్ లెదర్ అస్సలు ఎండిపోదు. గట్టిపడదు. విరిగిపోయినట్లుగా రావడమనే మాటే ఉండదు. దాని పైన ఉబ్బుగా ఉండే చిన్న చిన్న డాట్స్ స్పెషల్ అట్రాక్షన్. ఈ ప్రత్యేకతల వల్లే ఇది అంత ధర పలుకుతోంది.

ఇంత కాస్ట్లీ లెదర్ జాకెట్ వేసుకుని నీరవ్ పరుగులు పెట్టడంపై సోషల్ మీడియాలో ఇండియన్స్ హైలైట్ చేస్తూ సెటైర్లు వేశారు. క్యాబ్ దొరక్క అతడు అటూ ఇటూ వెళ్లడంతో ఎంత కాస్ట్లీ కోటు వేసుకున్నా క్యాబ్ దొరకడం కష్టం అన్నది దీని నీతి అంటూ ట్వీట్లు చేశారు. ‘వేల కోట్లు ఎగొట్టిన కేసులో ఉన్న నీకు ఆ జాకెట్టే చివరికి పనికొస్తుందేమో’ అంటూ మరికొందరు ట్వీట్ చేశారు.

‘కో ఇన్సిడెంటల్ గా ఆస్ట్రిచ్ జాకెట్ వెసుకున్న నీరవ్ మోడీ..  సారీ నో కామెంట్ అని తప్పించుకుంటూ.. ఆస్ట్రిచ్ కోడి లాగే ఎడారి ఇసుకలో తన తలను దూర్చే ప్రయత్నం చేశాడు’ అని మరో నెటిజన్ పంచ్ వేశాడు.