సైబర్ వారియర్స్ సృష్టికి కొత్త BTech CSE సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్

సైబర్ వారియర్స్ సృష్టికి కొత్త BTech CSE సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ సైబర్ మోసాలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో వాటిని పరిష్కరించేందుకు శిక్షణ పొందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం చాలా ఏర్పడింది. ఫలితంగా వీరికి డిమాండ్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయు) సైబర్ వారియర్స్ కోసం కొత్తగా BTech CSE లో సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి హైదరాబాద్‌లోని వర్సిటీ క్యాంపస్ కాలేజీలో ఈ కోర్సును ప్రత్యేకంగా అందించనున్నారు. సైబర్ క్రైమ్ కేసులను విజయవంతంగా ఛేదిస్తున్న తెలంగాణ పోలీసులకు చెందిన సైబర్ క్రైమ్ నిపుణులు ఇప్పుడు సైబర్ యోధులను రూపొందించడంలో విశ్వవిద్యాలయానికి సహాయం చేయనున్నారు.

JNTU, హైదరాబాద్, రాష్ట్ర పోలీసులతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ కోర్సు కోసం మూడో, నాల్గవ సంవత్సరంలో తరగతులు తీసుకోనున్నారు. నేర పరిశోధన సమయంలో ఉపయోగించే సాధనాలు, సాఫ్ట్‌వేర్‌లతో పాటు ప్రత్యక్ష ఉదాహరణలతో సైబర్ నేరాలను ఎలా గుర్తించాలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.