నయా సైబర్ క్రైమ్.. డిజిటల్ అరెస్టు

నయా సైబర్ క్రైమ్.. డిజిటల్ అరెస్టు

  
నోయిడా :  సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ‘డిజిటల్ అరెస్టు’ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితులకు వీడియో కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. వివిధ కేసుల పేరుతో అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉత్తరప్రదేశ్ లోని ఓ మహిళా ఇంజనీర్ నుంచి రూ.11.11 లక్షలు దోచుకున్నారు. దీనిపై నవంబర్ 22న కేసు నమోదైంది. 

డిజిటల్​గా బంధించి..  

నోయిడాకు చెందిన 50 ఏండ్ల మహిళకు నవంబర్ 13న ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్ వచ్చింది. తాను ముంబై పోలీస్ ఆఫీసర్ ను అని చెప్పి ఓ వ్యక్తి మాట్లాడాడు. ‘‘మీ ఆధార్ కార్డుతో కొంతమంది అక్రమాలకు పాల్పడ్డారు. దానితో ముంబైలో సిమ్ కార్డు తీసుకున్నారు. బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ఆ అకౌంట్ నుంచి రూ.2 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇందుకు మీకు రూ.20 లక్షలు చెల్లించినట్టుగా కేసు నమోదైంది. ఇది మనీ లాండరింగ్ కేసు. మిమ్మల్ని అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు వారెంట్ జారీ చేసింది” అని బాధితురాలిని బెదిరించాడు. ‘‘ఇదంతా మీకు తెలిసి జరగలేదని నా దర్యాప్తులో తేలింది. మిగతా దర్యాప్తు సీబీఐ ఆఫీసర్ పూర్తి చేస్తారు. ఆయనతో వీడియో కాల్ లో మాట్లాడండి” అని సూచించాడు. స్కైప్ ఐడీ పంపించాడు. అది నిజమేనని నమ్మిన బాధితురాలు.. స్కైప్ లో మరో వ్యక్తితో మాట్లాడింది. అతను సీబీఐ ఆఫీసర్ గా పరిచయం చేసుకున్నాడు. ‘‘ఇది మనీ లాండరింగ్ కేసు.

మీ లావాదేవీలన్నీ ఆడిటింగ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మీరు నిర్దోషిగా బయటపడాలంటే మీ అకౌంట్లలో సరిపడా డబ్బు ఉండాలి. మీ ఇతర అకౌంట్లలో ఉన్న డబ్బులన్నీ మీ ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ లోకి పంపించండి. దాని నుంచి మేం చెప్పిన పీఎఫ్ సీ అకౌంట్ కు పంపించండి. అలాగే ఐసీఐసీఐ నుంచి రూ.20 లక్షల ఇన్ స్టాంట్ లోన్ అప్లై చేయండి” అని చెప్పాడు. ‘‘నేను రూ.20 లక్షల లోన్ అప్లై చేయడానికి ఒప్పుకోలేదు. అయితే నాపై ఒత్తిడి తెచ్చి రూ.3 లక్షల లోన్ కు అప్లై చేయించారు. అలాగే నా అకౌంట్లలోని అన్ని డబ్బులను ట్రాన్స్ ఫర్ చేశాను. మొత్తంగా రూ.11.11 లక్షలు దోచుకున్నారు” అని బాధితురాలు వాపోయింది. అంతేకాకుండా తనను ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీడియో కాల్ లోనే ఉంచారని.. ఎవరికీ చెప్పొద్దని బెదిరించారని తెలిపింది.