- రాష్ట్రంలో 17,277 యూనిట్లకు టీఎస్ ఐపాస్ ద్వారా పర్మిషన్లు
- ఇందులో ఇంకా స్టార్ట్ కాని పరిశ్రమలు 7 వేలకుపైనే
- భూములు తీసుకుని ఏర్పాటు కానివి మరో 2 వేల యూనిట్లు
- ప్రారంభమే కాని పరిశ్రమల్లోనూ జాబ్‌లు ఇచ్చినట్టు సర్కార్ లెక్కలు
- ప్రైవేట్ సెక్టార్‌లో 16 లక్షల ఉద్యోగాలిచ్చినట్టు ప్రకటనలు
- రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 4.7 శాతం!
- ఏడేళ్లలో 13 వేల పరిశ్రమల మూత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని సర్కారు చెబుతున్నా.. నిజాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. చాలా కంపెనీలు కాగితాలపైనే కనిపిస్తున్నాయి. ఎంవోయూలు చేసుకోవడం తప్ప.. పరిశ్రమలు పెద్దగా ప్రారంభమైంది లేదు. 17 వేల కంపెనీలు తెచ్చినట్టు ప్రభుత్వం చెబుతున్నా వాటిలో 7 వేల యూనిట్లు ఇంకా మొదలే కాలేదు. వాటి సంగతి అటుంచితే.. ఏడేండ్లలో 13 వేల చిన్న పరిశ్రమలు మూతపడి నాలుగున్నర లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఏడేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. తెలంగాణలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేటు 4.7 శాతం ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సర్వే వెల్లడిస్తోంది.
ప్రారంభమే కాని పరిశ్రమల్లో ఉద్యోగాలా?
రాష్ట్రం వచ్చిన మొదట్లో చైనాకు వెళ్లి 16 కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. వాటిలో ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ప్రారంభం కాలేదు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో 700 కంపెనీలు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం కిటెక్స్ సంస్థ తప్ప మరే కంపెనీ ఇటువైపు రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఏడేండ్లలో టీఎస్ ఐపాస్ ద్వారా 17,277 పరిశ్రమలు స్థాపించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో 13,053 యూనిట్లు ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయని ప్రభుత్వం చెప్తోంది. కానీ, ప్రొడక్షన్ స్టార్ట్ కాని పరిశ్రమల సంఖ్య 7 వేల వరకు ఉంటుందని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. గతంలో భూములు తీసుకుని ఏర్పాటు కానివి మరో 2 వేల యూనిట్లు ఉన్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు మాత్రమే పొంది.. ఎలాంటి ప్రొడక్షన్ ప్రారంభించని పరిశ్రమల్లోనూ ఉపాధి కల్పిస్తున్నట్లు టీఎస్ ఐపాస్ వెబ్ సైట్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇవే లెక్కలను అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఇండస్ట్రీ అనుమతుల కోసం అప్లికేషన్ పెట్టుకునే సమయంలో ఇండస్ట్రియలిస్టులు అందులో యూనిట్ కాస్ట్, ఉపాధి కల్పించనున్న ఉద్యోగుల సంఖ్యను పేర్కొంటారు. ప్రభుత్వం ఇదే సంఖ్యను తీసుకుని ఉపాధి కల్పించామని ప్రకటిస్తోంది. రాష్ట్రంలో ప్రారంభమే కాని 7 వేల ఇండస్ట్రీల్లో ఆరేడు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెబుతోంది. మొత్తంగా కొత్తగా 17 వేల పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, వాటిలో 16 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించామని సర్కారు చెబుతోంది. అసలు ప్రారంభమే కాని పరిశ్రమల్లో జాబ్స్ ఎలా వచ్చాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అందని ఇన్సెంటివ్స్
రాష్ట్రంలో ప్రారంభించబోయే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)కు రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు ప్రకటించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్థానికంగా పరిశ్రమలు స్థాపించడం వంటి అంశాల ప్రాతిపదికన సబ్సిడీలు ఇస్తామని ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కొత్తగా పరిశ్రమ ఏర్పాటు చేసే టైంలో స్టాంప్ డ్యూటీ రీఫండ్, పెట్టుబడి మొత్తంలో ఆయా పరిశ్రమలను బట్టి 20 నుంచి 25 శాతం సబ్సిడీ ఇస్తామని వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమ స్థాయిని బట్టి మరింత అదనంగా రాయితీ ఉంటుందని తెలిపింది. మహిళా పారిశ్రామికవేత్తలకు సాధారణంగా లభించే రాయితీతోపాటు అదనంగా 10 శాతం ఇస్తామని పేర్కొంది. ఇవేగాక పావలా వడ్డీ లోన్లు, కరెంట్ వాడకంలో రాయితీ, పట్టణ, జిల్లా స్థాయిలో పరిశ్రమల వారీగా, ప్రాంతాల వారీగా ప్రత్యేక సబ్సిడీలు ప్రకటించింది. అయితే మూడేళ్లుగా రాయితీ సొమ్ము పూర్తి స్థాయిలో విడుదల కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు చెల్లించాల్సిన రాయితీ సొమ్ము రూ.1,500 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన బకాయిలే రూ.837 కోట్ల మేర ఉన్నాయి. వీరి కోసం తీసుకొచ్చిన ‘టీ ప్రైడ్’ స్కీమ్ ను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. ప్రభుత్వమిచ్చే సబ్సిడీ, ఇతర రాయితీలను సకాలంలో చెల్లించకపోవడంతో కొత్త పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తున్నారు.
నిరుద్యోగ రేటు మన దగ్గర ఎక్కువే
తెలంగాణలో నిరుద్యోగ రేటు ఆగస్టులో 4.7గా నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఇటీవల ప్రకటించిన సర్వేలో వెల్లడించింది. కొన్నేళ్లుగా ప్రకటిస్తున్న సర్వేల్లోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో వస్తోంది. మన పొరుగునే ఉన్న కర్నాటక (1.5)తో పాటు ఒడిశా(2.2), మేఘాలయ(0.6), గుజరాత్(1.6), మధ్యప్రదేశ్(3.5), హిమాచల్ ప్రదేశ్ (3.7) రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా తక్కువగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేటు నమోదైంది. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు చేస్తూనే ఉంది.
ఉపాధి కోల్పోయినోళ్లు 4.5 లక్షల మంది
తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుమారు 13 వేల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గడిచిన ఏడేండ్లలో మూతపడ్డాయి. ఫలితంగా సుమారు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జీఎస్టీ అమలుతోపాటు లెవీ సేకరణపై ఆంక్షలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం, రాయితీలు అందకపోవడం, లాక్ డౌన్ తదితర కారణాలతో రాష్ట్రంలో చాలా పరిశ్రమలు దివాలా అంచుకు చేరుకున్నా.. ప్రభుత్వం వాటిని ఆదుకునే ప్రయత్నం చేయలేదు.
ఉన్న ఉద్యోగులనే తీసేస్తున్రు
పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయి. కొన్ని ఇండస్ర్టీస్‌కు పర్మిషన్ వచ్చినా, ఇప్పుడు పరిస్థితులు తారుమారు అవడంతో వాటిని పెట్టేందుకు ఆలోచిస్తున్నరు. ల్యాండ్ విషయంలోనూ కొందరికి ఇబ్బందులు వస్తున్నయి. ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలను విస్తరించేందుకు వెనకడుగు వేస్తున్నయి. అనేక మందిని ఉద్యోగాల నుంచి తీసేసినయ్. ఇప్పటికిప్పుడు కొత్తగా తీసుకునే అవకాశం అసలే లేదు. కరోనాతో ఇండస్ర్టీస్ చాలా దారుణంగా దెబ్బతిన్నయి. ప్రోత్సాహకాలు సరిగ్గా అందడం లేదు.
‑ స్వామిగౌడ్, ఇండస్ట్రియలిస్ట్, గాంధీనగర్
డీపీఆర్‌లో చెప్పినంత మందికి ఉపాధి ఇవ్వరు
ఒక ఇండస్ర్టీ యూనిట్ పెట్టే ముందు డీపీఆర్ తయారు చేస్తరు. ఆ ప్రాజెక్టు రిపోర్ట్‌లో 500 మందికి ఉపాధి కల్పిస్తమని చెబితే అంతమందికి కల్పించే అవకాశం ఉండదు. అందులో సగం మందికే ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రతి కంపెనీ యూనిట్మొదలుపెట్టే ముందు లెక్కలు పెద్దగానే ఉంటాయి. వాణిజ్య కార్యకలపాలు ప్రారంభించేటప్పుడు ఆ స్థాయిలో ఉద్యోగులను ఏ పరిశ్రమలోనూ పెట్టుకోరు. లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది లెక్కల్లోనే ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.
- చందన్, ఇండస్ర్టియలిస్ట్, గాంధీనగర్
