భారత ఐటీ రంగంలో ఉద్యోగులకు ఈసారి అప్రైజల్స్ పెద్ద షాక్‌నే ఇచ్చాయి. ప్రమోషన్లు వచ్చినా, రేటింగ్స్ బాగున్నా.. చేతికి వచ్చే నెలవారీ జీతం డబ్బులు మాత్రం పెరగకపోగా, కొన్ని కంపెనీల్లో తగ్గిపోతోంది. ఈ పరిస్థితికి కేవలం ఐటీ రంగంలో ఉన్న మందగమనమే కాదు.. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త లేబర్ కోడ్స్ కూడా కారణం అయ్యాయి. ఈ కొత్త చట్టాలకు అనుగుణంగా దేశంలోని ఐటీ దిగ్గజాలు తమ శాలరీ స్ట్రక్చర్‌ను మార్చేస్తుండటంతో ఉద్యోగుల ఇన్-హ్యాండ్ శాలరీ తగ్గిపోతోంది. TCS ఇటీవల విడుదల చేసిన కాంపెన్సేషన్ లెటర్లలో అలవెన్సులు తగ్గడం, గ్రాట్యుటీ లెక్కలు మారడం వంటి అంశాలు బయటపడ్డాయి. అన్ని ఐటీ కంపెనీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
కొత్త కోడ్ ఆన్ వేజెస్ ప్రకారం.. ఒక ఉద్యోగి మొత్తం జీతంలో బేసిక్ పే కనీసం 50 శాతం ఉండాలి. గతంలో కంపెనీలు బేసిక్ పే తక్కువగా చూపిస్తూ.. మిగిలిన మొత్తాన్ని రకరకాల అలవెన్సులు, ఫ్లెక్సిబుల్ పే రూపంలో ఇచ్చేవి. దీనివల్ల కంపెనీలకు పీఎఫ్, గ్రాట్యుటీ భారం తగ్గేది. ఉద్యోగులకు చేతికి ఎక్కువ జీతం వచ్చేది. కానీ ఇప్పుడు బేసిక్ పే తప్పనిసరిగా 50 శాతానికి పెంచాల్సి రావడంతో.. దానికి లింక్ అయి ఉండే ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్లు కూడా భారీగా పెరిగిపోయాయి. గతంలో బేసిక్ పే తక్కువగా ఉన్నప్పుడు కట్ అయిన పీఎఫ్ కంటే.. ఇప్పుడు బేసిక్ పే పెరగడం వల్ల కట్ అయ్యే పీఎఫ్ అమౌంట్ చాలా ఎక్కువగా ఉందట. ఈ అదనపు పీఎఫ్ కటింగ్స్ వల్ల ఉద్యోగి అకౌంట్లోకి వచ్చే నెలవారీ జీతం తగ్గిపోతుంది. ఈ డబ్బు ఉద్యోగి రిటైర్మెంట్ ఫండ్‌కే వెళ్తున్నప్పటికీ.. ప్రస్తుతం నెలవారీ ఖర్చులకు మాత్రం చేతిలో డబ్బు తగ్గుతోంది.
గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, AI వల్ల వస్తున్న మార్పుల వల్ల ఐటీ రంగంలో జీతాల పెరుగుదల రేటు ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. 2026లో టెక్నాలజీ రంగంలో సగటు జీతాల పెరుగుదల కేవలం 6.6 శాతంగా మాత్రమే నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ తక్కువ పెంపునకు తోడు లేబర్ కోడ్ మార్పులు తోడవ్వడంతో ఉద్యోగులు నష్టపోతున్నారు. ఈ అదనపు ఖర్చులను మేనేజ్ చేయడానికి కంపెనీలు తమ సీటీసీ స్ట్రక్చర్ నుండి గ్రాట్యుటీని విడిగా చూపించడం, హెచ్‌ఆర్‌ఏ, పర్సనల్ అలవెన్సులను పూర్తిగా మార్చేయడం వంటి పనులు చేస్తున్నాయి. దీనివల్ల పేపర్ మీద సీటీసీ అటూ ఇటూగా కనిపిస్తున్నా.. చేతికి వచ్చే డబ్బు మాత్రం తగ్గిపోతోంది.
►ALSO READ | ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో భారత్‌లో 5జీ టెక్నాలజీ కొత్త దశకు శ్రీకారం
కంపెనీలు తమ వేరియబుల్ పే విధానంలో కూడా కీలక మార్పులు చేస్తున్నాయి. దాదాపు 28 శాతం కంపెనీలు వార్షిక వేరియబుల్ పే స్థానంలో త్రైమాసిక వేరియబుల్ పే విధానాన్ని తెస్తున్నాయి. అలాగే 45 నుంచి 50 శాతం కంపెనీలు కేవలం పనితీరు ఆధారంగా కాకుండా.. ఉద్యోగికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగానే ఎక్కువ జీతాలు ఇస్తున్నాయి. టాప్ పర్ఫార్మర్లకు సగటు ఉద్యోగుల కంటే 1.6 నుండి 1.8 రెట్లు ఎక్కువ బోనస్ లభిస్తుండటంతో.. సాధారణ ఉద్యోగులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా పడుతోంది.
సో చట్టపరమైన రూల్స్ పాటించాల్సి రావడం వల్లే ఈ మార్పులు జరుగుతున్నాయని, కంపెనీలు ఉద్యోగులను మోసం చేయడం లేదు. పెరిగిన కటింగ్స్ వెనుక ఉన్న భవిష్యత్తు లాభాలను లక్షలాది మంది ఉద్యోగులకు వివరించి చెప్పడం ఇప్పుడు ఐటీ కంపెనీల ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది.
