విద్వేష ప్రసంగాల నియంత్రణకు కొత్త చట్టం : సీఎం రేవంత్ రెడ్డి

విద్వేష ప్రసంగాల నియంత్రణకు కొత్త చట్టం : సీఎం రేవంత్ రెడ్డి
  •     వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే తెస్తం: సీఎం రేవంత్ రెడ్డి 
  •     మైనార్టీలకు 4% రిజర్వేషన్లను కాపాడుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు విద్వేష ప్రసంగాలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్టు సీఎం రేవంత్‌‌ రెడ్డి వెల్లడించారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాల నియంత్రణకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్టు ప్రకటించారు. ‘‘దేశం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు ఎంతో అవసరం. 

ఏ ఒక్కరి వల్లనో దేశం అభివృద్ధి చెందదు. అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే ప్రగతి సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌‌లో జమీయత్‌‌ ఉలమా ఏ హింద్‌‌ సంస్థ నిర్వహించిన సభలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సంస్థకు దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఘనమైన చరిత్ర ఉందని కొనియాడారు. 

మైనారిటీలు, మెజారిటీ ప్రజలు కలిసి ముందుకెళ్లడానికి ఈ సంస్థ కృషి చేస్తోందన్నారు. ‘‘నా రాజకీయ ప్రస్థానంలో.. ‘గల్లీ నుంచి ఢిల్లీ’ వరకు ఎదుగుదలలో ఈ సంస్థ సహకారం మరువలేనిది. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు హిందువులతో పాటు ముస్లింలు అండగా నిలబడ్డారు. ఆ బలంతోనే లోక్‌‌సభలో రాహుల్‌కు తోడుగా మోదీ, అమిత్ షాపై పోరాడగలిగాను” అని పేర్కొన్నారు. 

రిజర్వేషన్ల కోసం సుప్రీంలో పోరాడ్తం.. 

వైఎస్ రాజశేఖర్‌‌‌‌ రెడ్డి మైనారిటీలకు అందించిన 4 శాతం రిజర్వేషన్లను కాపాడుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘4 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. రాష్ట్రంలో మేం చేపట్టిన కులగణనలో మైనారిటీల జనాభా వివరాలను కూడా సేకరించాం. రిజర్వేషన్ల కేసు విచారణకు వచ్చినప్పుడు ఈ గణంకాలను కోర్టుకు అందజేసి, మైనారిటీలకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం’’ అని హామీ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ల వల్ల ఇప్పటికే ఎంతోమంది మైనారిటీలకు ఉద్యోగ అవకాశాలు లభించాయని, భవిష్యత్తులోనూ వీటిని కొనసాగిస్తామన్నారు.  

మైనార్టీలకు అండగా ఉంటాం.. 

మైనారిటీలు విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలరని సీఎం సూచించారు. ‘‘కాంగ్రెస్ ఎప్పుడూ మైనారిటీలకు పెద్దపీట వేస్తుంది. సల్మాన్ ఖుర్షీద్, అహ్మద్ పటేల్ వంటి వారు పార్టీలో అగ్ర నాయకులుగా ఎదిగారు. రాష్ట్రంలోనూ అజారుద్దీన్, షబ్బీర్ అలీ వంటి నేతలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. 8 కార్పొరేషన్ల చైర్మన్ పదవులను మైనారిటీలకే కేటాయించాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మైనారిటీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి” అని పిలుపునిచ్చారు.