కొత్త దవాఖాన్లు  వాస్తుకు లేవట!

కొత్త దవాఖాన్లు  వాస్తుకు లేవట!
  • డిజైన్ల ఖరారులో వాస్తు కన్సల్టంట్​ ప్రమేయం
  •  ఇంకో రెండేండ్ల తర్వాతే హాస్పిటళ్లు
  • వరంగల్​ దవాఖాన  24 అంతస్తులకు కుదింపు
  • ఎక్స్​పర్ట్​ ఇచ్చిన డిజైన్లలో మార్పులు


హైదరాబాద్​, వెలుగు:  కొత్త మెడికల్​ కాలేజీలు, సూపర్​ స్పెషాలిటీ దవాఖాన్లకు ‘వాస్తు’ దోషం పట్టుకుంది. కాలేజీలు, దవాఖాన్ల కోసం మెడికల్​ ఎక్స్‌పర్ట్స్​ ఇచ్చిన డిజైన్లలో వాస్తు దోషాలు ఉన్నాయని చెప్తూ వాటి డిజైన్లను మార్పిస్తున్నారు. 8 మెడికల్​ కాలేజీలు, వరంగల్​ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​, హైదరాబాద్​ చుట్టూ కట్టనున్న మరో మూడు ఆస్పత్రుల కోసం మెడికల్​ ఎక్స్​పర్ట్స్​ సూచనల మేరకు ఆర్కిటెక్చర్లు డిజైన్లను తయారు చేశారు. వాటిని పరిశీలించేందుకు మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి నేతృత్వంలో ఆర్​‌అండ్​ బీ, హెల్త్​ ఆఫీసర్లు రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు ఆర్కిటెక్ట్​ కంపెనీలు తమ డిజైన్లను పవర్​పాయింట్​ ద్వారా ప్రెజెంట్​ చేశాయి. డిజైన్లలో వాస్తు దోషాలు ఉన్నట్టు తేల్చి, వాస్తు ప్రకారం డిజైన్లను మార్చాల్సిందిగా సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ వాస్తు కన్సల్టంట్‌ సుధాకర్​ తేజ సూచించినట్టు తెలుస్తోంది. సైంటిఫిక్​గా నిర్మించాల్సిన హాస్పిటళ్లలో, వాస్తు పేరిట మార్పులు చేయించడంపై ఆర్​ ‌అండ్​ బీ, హెల్త్​ ఆఫీసర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటళ్లలో ల్యాబులు, డయాగ్నస్టిక్స్​ వార్డ్స్​కు వాస్తు కంటే సేఫ్టీ చాలా ముఖ్యమని హెల్త్​ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. 
నాలుగైదు నెలలైతున్నా.. 
గ్రేటర్​ హైదరాబాద్​ చుట్టూ 4 హాస్పిటళ్లు కడ్తామని ఏడేండ్లుగా రాష్ట్ర సర్కార్​ నానుస్తూనే వస్తోంది. ఈటల రాజేందర్​ రాజీనామా తర్వాత కొత్త దవాఖాన్లు, మెడికల్ కాలేజీల ప్రచారాన్ని సర్కార్​ మరింత పెంచింది. అల్వాల్​, కొత్తపేట ఫ్రూట్​ మార్కెట్​, చెస్ట్​ హాస్పిటల్​ ప్రాంగణంలో మూడు హాస్పిటళ్లు నిర్మిస్తామని ప్రకటించింది. అయితే నాలుగైదు నెలలు అవుతున్నా ఇప్పటిదాకా దవాఖాన్ల డిజైన్లే ఖరారు కాలేదు. వాస్తు పేరిట వాటిని ఇంకా ఆలస్యం చేస్తున్నారు. డిజైన్ల ఖరారు, టెండర్లు పూర్తయ్యేసరికే ఇంకో 3 నెలలు పట్టేలా ఉంది. నిర్మాణం మొదలుపెట్టి, అవి హాస్పిటళ్లుగా రూపుదిద్దుకునేసరికి ఇంకో రెండేండ్లు పట్టొచ్చని హెల్త్​ ఆఫీసర్లు చెప్తున్నారు. కొత్త మెడికల్​ కాలేజీలకు ప్రస్తుతం టెంపరరీ నిర్మాణాలు చేపడుతున్నామని, రెండేండ్లు వాటిల్లోనే కాలేజీ నడిపిస్తామని అంటున్నారు.

ఎక్స్​పర్ట్​ ఇచ్చిన డిజైన్లలో మార్పులు


వరంగల్​ హాస్పిటల్​.. ‘ఏక్​మినార్​’
దేశంలో ఎక్కడ లేని రీతిలో కడ్తామన్న వరంగల్​ హాస్పిటల్​ పనులూ ఇంకా మొదలు కాలేదు. 33 అంతస్తులతో ఈ హాస్పిటల్​ను కట్టబోతున్నట్టు సీఎం కేసీఆర్​‌ జూన్​లో ప్రకటించారు. దీంతో 33 అంతస్తుల హాస్పిటల్​ డిజైన్​ చేయాలని ఆర్కిటెక్ట్​లకు సర్కార్​ సూచించింది. ఎంత పెద్ద ఆస్పత్రైనా 33 అంతస్తులు అవసరం లేదని, అది సాధ్యం కాదని ఆర్కిటెక్ట్​లు, హెల్త్​ఎక్స్​పర్ట్​లు తేల్చేశారు. ఎక్కువలో ఎక్కువ 14 అంతస్తులు సరిపోతాయని సూచించారు. 33 అంతస్తులని చెప్పి 14 అంతస్తులు కడితే విమర్శలు ఎదురవుతాయని భావించిన సర్కార్​..  24 అంతస్తుల వరకూ ప్లాన్​ చేయాలని ఆర్కిటెక్ట్​లకు సూచించినట్టు తెలిసింది. దీంతో 14 అంతస్తుల వరకూ వెడల్పుగా, ఆ తర్వాత నుంచి వెడల్పు తగ్గిస్తూ స్థూపం తరహాలో 24 అంతస్తుల వరకూ డిజైన్లను రూపొందించినట్టు తెలిసింది. ఈ డిజైన్​నూ రెండ్రోజుల క్రితం జరిగిన మీటింగ్​లో ఆర్కిటెక్ట్​లు చూపించారు. ఆయా డిజైన్లు ‘ఏక్​ మినార్​’ టైప్​లో ఉన్నాయని, ఆర్​ ‌అండ్​ బీ ఆఫీసర్​ ఒకరు వ్యాఖ్యానించారు.