మరో నాలుగు రోజుల తర్వాతే..కొత్త రేషన్ కార్డులు వెరిఫికేషన్..లిస్టు తయారీలో ఆలస్యం వల్లే వాయిదా

మరో నాలుగు రోజుల తర్వాతే..కొత్త రేషన్ కార్డులు వెరిఫికేషన్..లిస్టు తయారీలో ఆలస్యం వల్లే వాయిదా
  • వదలని ముసురు కూడా కారణమే

హైదరాబాద్​సిటీ, వెలుగు: పట్నంలో కొత్త రేషన్​కార్డుల పంపిణీ ఆలస్యమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శుక్రవారం నుంచే రేషన్​కార్డుల పంపిణీ మొదలువుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, జంటనగరాల్లో కార్డుల పంపిణీ మాత్రం షురూ కాలేదు. వెరిఫికేషన్​పనుల్లో అధికారులు బిజీగా ఉండడం, సర్కిళ్లవారీగా అర్హుల జాబితా తయారు చేయడంలో కొనసాగుతున్న ఆలస్యం, వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కార్డుల పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోందని సివిల్​సప్లయీస్​ఆఫీసర్లు చెప్తున్నారు.

 పంపిణీకి మరో మూడు, నాలుగు రోజులు పట్టవచ్చని సదరు శాఖ ఆఫీసర్లు సమాధానమిస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్​లో జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​రేషన్​కార్డుల విషయమై అధికారులతో రివ్యూ నిర్వహించారు. కార్డుల పంపిణీలో ఆలస్యానికి అధికారుల అలసత్వం కూడా ఒక కారణమని, బల్దియా, రెవెన్యూ అధికారులు కొత్త దరఖాస్తుల వెరిఫికేషన్​ను స్పీడప్​చేసి కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 దీంతో సివిల్​సప్లయీస్​అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో ఇప్పటికే 28,280 కార్డులు పంపిణీకి సిద్ధం చేశారు. శుక్రవారమే వీటి పంపిణీ కార్యక్రమం మొదల్వాల్సి ఉండగా, మరోసారి వాయిదా వేసుకున్నారు.  

వచ్చే నెల15 లోపు పక్కా...

సిటీలో నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్​కార్డుల పంపిణీకి అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెల15వ తేదీలోపు పంపిణీ పూర్తి చేసేందుకు అవకాశం ఉందని, కాబట్టి మరో మూడు, నాలుగు రోజుల్లో కార్డుల పంపిణీ మొదలుపెట్టి గడువు లోపు పూర్తి చేస్తామంటున్నారు. మొదటి విడతలో 28,280 కార్డులు పంపిణీకి సిద్ధం చేశామని చెప్తున్నారు. 

అలాగే, సిటీలో రేషన్ కార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని, మీసేవ కేంద్రాల నుంచే రోజుకు మూడు వేల అప్లికేషన్లు వస్తున్నాయంటున్నారు. దీంతో వెరిఫికేషన్ కు ఆలస్యం అవుతోందని చెప్తున్నారు. కొత్త రేషన్​కార్డుదారులకు సెప్టెంబర్​నుంచి రేషన్​ఇస్తామని చెప్తున్నారు.