బోరిస్ కూడా ఒక పేషెంటే : చికిత్స చేసిన నర్స్

బోరిస్ కూడా ఒక పేషెంటే : చికిత్స చేసిన నర్స్
  • ట్విటర్​లో మెచ్చుకున్న బ్రిటిష్ ప్రధాని
  • ఫేస్​బుక్​లో థ్యాంక్స్  చెప్పిన‌ న్యూజీలాండ్ ప్రధాని జెసిండా 

లండన్ : ‘నన్నుకూడా ఒక పేషెంట్​లాగే చూశారు’ అని ట్వీట్ చేశారు బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఆయన ఈమధ్య కరోనా పాజిటివ్ రావడంతో ఐసీయూలో చేరాల్సి వచ్చింది. వైరస్ నుంచి కోలుకుని బయటకు వచ్చాక ఆ ట్వీట్ చేశారు. మొదట్లో బోరిస్ ఏదో చిలిపి కామెంట్ చేసినట్లుగా అందరూ భావించారు. కానీ, ఆయన సీరియస్​గానే… ‘ఐసీయూ నర్స్ నన్ను స్పెషల్​గా చూడలేదు. ఇన్వర్ కార్గిల్​ (న్యూజీలాండ్​)కి చెందిన జెన్నీకి థ్యాంక్స్​’ అన్నారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ ఈ నెల 13న హాస్పిటల్ నుంచి క్షేమంగా బయటకొచ్చారు.

‘ఈ ట్వీట్ చూసినప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరో జోక్ చేసినట్లనిపించింది’ అని నర్స్ జెన్నీ మెక్​జీ అన్నారు. ఐసీయూలో పదేళ్లుగా ఆమె నర్స్​ గా పనిచేస్తున్నారు. ఐసీయూలోకి వచ్చినవాళ్లందరినీ మేము సీరియస్ పేషెంట్లుగానే చూస్తామని, అలాగే బోరిస్ ని చూశామని చెప్పారు.

బోరిస్ జాన్సన్​కి కరోనా సోకినట్లు తేలగానే కంటికి రెప్పలా చూసుకున్నామన్నారు. ‘ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ఆయన బెడ్ దగ్గరే నేను, మరో నర్స్ 48 గంటల పాటు కూర్చున్నాం’ అని గుర్తు చేసుకున్నారు జెన్నీ. ‘కరోనా వైరస్ వల్ల రోగుల దగ్గర ఫ్యామిలీవాళ్లెవరూ ఉండరు. అలాంటప్పుడు రోగులకు మేమే ధైర్యం చెప్పాలి. వాళ్ల చేతిని విడువకూడదు. నేను న్యూజీలాండర్​నని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మా సేవలు చూశాక నర్సింగ్ సైడ్ వస్తామని చాలామంది అంటున్నారు’ అని జెన్నీ చెప్పారు.

సెలవు రద్దు చేసుకుని డ్యూటీకి హాజరు

కరోనా వార్తలు వచ్చే సమయానికి ఆమె తమ దేశానికి సెలవుల్లో వెళ్లారు. వైరస్ వ్యాపిస్తున్నట్లు తెలియగానే మధ్యలోనే లండన్ వచ్చేశారు. బోరిస్ జాన్సన్ మెచ్చుకోవడం చూసి, న్యూజీలాండ్ ప్రధాని జెసిండా అర్డర్న్​ కూడా జెన్నీని మెచ్చుకుంటూ ఫేస్​బుక్​లో పోస్టు పెట్టారు.