- న్యూజిలాండ్‌లో ఐదుగురు టూరిస్టులు మృతి
- 23 మంది గల్లంతు
- దట్టమైన పొగ, బూడిద వల్ల సహాయక చర్యలకు ఆటంకం
వెల్లింగ్టన్(న్యూజిలాండ్): న్యూజిలాండ్ నార్త్‌కోస్ట్‌లోని వక్కారీ ఐలాండ్‌లో సోమవారం అగ్నిపర్వతం పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు టూరిస్టులు చనిపోయారు. 18 మంది గాయపడ్డారు. అగ్నిపర్వతం పేలినప్పుడు దాదాపు 100 మంది టూరిస్టులు అక్కడ ఉన్నారని, వారిలో ఐదుగురి డెడ్‌బాడీస్ వెలికి తీశామని పోలీసులు చెప్పారు. దెబ్బలు తగిలిన వారిలో ఏడుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. దాదాపు 23 మంది ఆచూకి తెలియాల్సి ఉంది. దట్టమైన పొగ, బూడిద ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోందని పోలీసులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఐలాండ్‌లో గల మరికొన్ని అగ్నిపర్వతాలు పేలే అవకాశం ఉందని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ స్పందించారు. టూరిస్టుల్లో ఎక్కువ శాతం ఆస్ట్రేలియన్లు ఉన్నారని చెప్పారు. ఈ ఐలాండ్‌లో 2016లో కూడా అగ్నిపర్వతం పేలింది.అయితే ఆ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.
న్యూజిలాండ్‌లో ఫేమస్
న్యూజిలాండ్‌లో ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌లో వక్కారీ ఐలాండ్ ఒకటి. వాల్కనో ప్రభావం ఎక్కువగా ఉన్న ఐలాండ్ ఇది. ఏటా దాదాపు 10 వేల మంది టూరిస్టులు ఈ ఐలాండ్‌కు వస్తారని అధికారులు చెప్పారు.
“ మేం అప్పుడే తిరుగు ప్రయాణం అయ్యాం. ఒక్కసారిగా దట్టమైన పొగ, బూడిద వచ్చాయి. వెంటనే వెళ్లి కొంత మందిని కాపాడాం” – మైకెల్, అమెరికన్ టూరిస్ట్
“ ఐలాండ్ మొత్తం బూడిదతో కవరైపోయింది. రెస్క్యూకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. చనిపోయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూకి సంబంధించి నిపుణులతో చర్చిస్తున్నాం” – జాన్ టిమ్స్, డిప్యూటీ పోలీస్ కమిషనర్

