రాబోయే రెండు రోజులు వర్షాలు.. వడగాడ్పులు..  వాతావరణ శాఖ వెల్లడి

రాబోయే రెండు రోజులు వర్షాలు.. వడగాడ్పులు..  వాతావరణ శాఖ వెల్లడి

 

  • రాబోయే రెండు రోజులు వర్షాలు.. వడగాడ్పులు..  వాతావరణ శాఖ వెల్లడి
  • ఆదివారం పలుచోట్ల ఓ వైపు ఎండ.. మరోవైపు వర్షం
  • సంగారెడ్డిలో అత్యధికంగా  6.7 సెంటీ మీటర్ల వాన
  • జయశంకర్ జిల్లా  మహదేవ్​పూర్​లో 45.5 డిగ్రీలు

హైదరాబాద్/పరిగి, వెలుగు: రాష్ట్రంలో రాబో యే 2రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల వర్షాలు పడతాయని.. అదే టైంలో వడగాడ్పులూ ఉంటాయని ఆదివారం హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. 4రోజుల పాటు పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు ఆదివారం 
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం

సంగారెడ్డి జిల్లా నాగలగిద్దలో అత్యధికంగా 6.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా తాండూరులో 5 సెం.మీ, నిజామాబాద్ జిల్లా గోపనపల్లిలో 5 సెం.మీ వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్​లోని కుత్బుల్లాపూర్, హెచ్​సీయూ, కార్వాన్, అల్వాల్, శేరిలింగంపల్లి, గాజులరామారాం, గచ్చిబౌలి, లంగర్ హౌస్, పఠాన్ చెరువు, జీడిమెట్ల, ఆర్సీపురంలో వర్షం కురిసింది. జయశంకర్ జిల్లా మహదేవ్​పూర్​లో అత్యధికంగా 45.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 45.1, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జంబుగలో 45 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. 

రుతుపవనాలు లేటయ్యే చాన్స్​

11వ తేదీ నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే చాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసినప్పటికీ.. మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం లక్షద్వీప్ పరిసరాల్లో ఉన్న రుతుపవనాలు ముందుకు కదలడం లేదని, అందుకు అనుకూల వాతావరణం లేదని ఐఎండీ చెప్తున్నది. సోమవారం అరేబియా సముద్రంలో డిప్రెషన్ ఏర్పడుతుందని, దాని ప్రభావంతో రుతు పవనాల్లో కదలిక వచ్చే చాన్స్​ ఉందని తెలిపింది.

ఈదురు గాలుల బీభత్సం

సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పటాన్ చెరు, సదాశివపేట, కంగ్టి, మునిపల్లి, నారాయణఖేడ్ మండలాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురి సింది. సంగారెడ్డి, కంగ్టి ప్రాంతాల్లో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం రహీంగూడ తండాకు చెందిన పలువురి ఇండ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. గుజిరితండాలో పిడుగుపాటుకు వరి గడ్డి కాలిపోయింది. ఆసిఫాబాద్ మండలం జెండాగూడ గ్రామానికి చెందిన దుర్గం ధర్మయ్య ఎద్దు ట్రాన్స్​ఫార్మర్​ వైర్లు తగిలి చనిపోయింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, దోమకొండ మండల కేంద్రాల్లో చెట్లు, కరెంట్ పోళ్లు విరిగిపడ్డాయి. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం సాల్విడ్ గ్రామంలో ఆదివారం పిడుగు పాటుకు 31 మూగ జీవాలు చనిపోయాయి. వీటిలో 26 గొర్రెలు ఉన్నాయి.